శనివారం 30 మే 2020
Hyderabad - Apr 28, 2020 , 23:31:10

కట్టడితో అదుపులోకి

కట్టడితో అదుపులోకి

  •  గ్రేటర్‌లో తగ్గుముఖం పడుతున్న కేసులు 
  • రెడ్‌జోన్ల ఏర్పాటుతో వైరస్‌ కట్టడి   
  •  సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశంతో  కఠినంగా అమలవుతున్న లాక్‌డౌన్‌   
  • ఏప్రిల్‌ 18నుంచి అదుపులోకి 
  • ఇప్పుడే అంచనా వేయలేమంటున్న నిపుణులు

కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నది. మార్చి 2న హైదరాబాద్‌ నగరంలో మొదటి కేసు నమోదై క్రమంగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలు వణికిపోయారు. అయితే గడిచిన వారం రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో గ్రేటర్‌ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం గ్రేటర్‌లో కేవలం రెండే కేసులు నమోదు కాగా.. మంగళవారం 6 నమోదయ్యాయి. అయితే పరిస్థితిని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు.

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నది. హైదరాబాద్‌ నగరంలోనే అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే కొవిడ్‌-19 నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు, వైద్య, ఆరోగ్యశాఖ విశేష కృషి, పకడ్బందీగా క్వారంటైన్‌ చర్యలు, కంటైన్మెంట్‌ జోన్‌ల నిర్వహణ తదితర వ్యాప్తి నివారణ చర్యలతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రారంభంలో చాలా నెమ్మదిగా మొదలైన కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఏప్రిల్‌ 3నుంచి ఒక్కసారిగా ఎగబాకుతూ వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో తొలి కేసు మార్చి 2న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో నమోదై మధ్యలో 14రోజుల పాటు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అనంతరం మార్చి 15న గ్రేటర్‌ పరిధిలోని కొత్తపేట వాసవీకాలనీలో రెండవ కేసు, 16న జూబ్లీహిల్స్‌లో మూడో కేసు నమోదైంది. ఈ విధంగా మార్చి 26 వరకు అడపా దడపా 5లోపు మాత్రమే కేసులు నమోదవుతూ వచ్చాయి. అప్పటి వరకు నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవారివే. ఇక మార్చి 26న గ్రేటర్‌లో మొత్తం 5కేసులు నమోదవ్వగా అందులో 4కేసులు విదేశీ సంబంధ కేసులే. అయితే తొలిసారిగా ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వ్యక్తికి సంబంధించి సికింద్రాబాద్‌లోని బౌద్ధనగర్‌లో మొదటి మర్కజ్‌ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మర్కజ్‌ లింకును ఛేదించేందుకు వైద్య, ఆరోగ్య, పోలీసు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖలను సంయుక్తంగా రంగంలోకి దింపింది. ప్రభుత్వ శాఖలన్నీ పరస్పర సహకారంతో సమన్వయంగా పనిచేస్తూ సుమారు 800మందికి సంబంధించిన మర్కజ్‌ చైన్‌ను ఛేదించగలిగారు. అనుమానితులను ఎప్పటికప్పుడు గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, వారికి వైద్యపరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా గుర్తించిన వారిని వెంటనే గాంధీకి తరలించి మెరుగైన చికిత్స అందించారు. ఇదిలా ఉండగా ఒక దశలో కేసులు విపరీతంగా పెరగడంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లోనూ అందోళన మొదలైంది. కానీ ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా లాక్‌డౌన్‌ను 100 శాతం కఠినంగా అమలు చేయడంతో పాటు రెడ్‌జోన్‌లను ఏర్పాటు చేసి వైరస్‌ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించకుండా కట్టడిచేయడంలో సఫలీకృతమైంది. ఆశావహ పరిస్థితుల్లో ఈ నెల 18నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడం శుభపరిణామం.


logo