గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 28, 2020 , 23:27:08

చర్యలు భేష్‌

చర్యలు భేష్‌

సిటీబ్యూరో/ చందానగర్‌/ అబిడ్స్‌:  బల్దియా చేపడుతున్న కరోనా కట్టడి చర్యలు, అందిస్తున్న సేవలపై కేంద్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. పారిశుధ్యం, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ తదితర విభాగాల సిబ్బందిలో   ఆత్మైస్థెర్యం పెంపొందిందేలా  మంత్రి కేటీఆర్‌ వారితో మాట్లాడిన వీడియోలు  వీక్షించి, మంత్రి చొరవను అభినందించింది.  జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక నేతృత్వంలోని కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారుల బృందం మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌ పనితీరును పరిశీలించింది.  వారు అందిస్తున్న సేవల వివరాలు తెలుసుకున్నది. కరోనా కట్టడికి సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నట్లు  జీహెచ్‌ఎంసీ అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. అత్యవసర సేవల కోసం 32 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇక్కడ చిక్కుకుపోయి హోటళ్లలో ఉన్న విదేశీ సందర్శకులకు కల్పిస్తున్న సౌకర్యాలపై పర్యాటక అధికారి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 

సౌకర్యాలపై ఆరా..

నలగండ్ల అపర్ణ కన్‌స్ట్రక్షన్‌ నిర్మాణ ప్రాంతంలోని లేబర్‌ క్యాంపును కేంద్ర బృందం పరిశీలించి, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ను సందర్శించింది పారిశుధ్య పనులు, లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై ఆరా తీసింది. విక్టరీ ప్లే గ్రౌండ్స్‌, ఎగ్జిబిషన్‌ మైదానంలోని జీహెచ్‌ఎంసీ షెల్టర్లలో కల్పిస్తున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నది. కేంద్ర బృందంలో కేంద్ర ప్రజారోగ్య శాఖ సీనియర్‌ వైద్యుడు చంద్రశేఖర్‌, జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌, విపత్తుల నివారణ సంస్థ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేది ఉన్నారు.


logo