శనివారం 30 మే 2020
Hyderabad - Apr 28, 2020 , 23:23:41

బియ్యం, నగదు అందరికీ అందాలి

బియ్యం, నగదు అందరికీ అందాలి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రతి ఒక్కరికీ బియ్యం అందేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. సమాచార కమిషనర్‌ కార్యాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొని పలు అంశాలపై సమీక్షించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సివిల్‌ సప్లయ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, సీఆర్వో బాల మాయాదేవిలు ఈ సమావేశంలో పాల్గొనగా, మేడ్చల్‌, రంగారెడ్డి కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, అమోమ్‌కుమార్‌లు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో  5.54 లక్షల తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యం సరఫరా, రూ.1500 నగదు ఖాతాలలో జమ చేసే కార్యక్రమం పూర్తయిందని సీఆర్వో వెల్లడించారు. కొన్ని ప్రాంతాలలో వలస కార్మికులకు బియ్యం సరఫరా జరగలేదని, ఆయా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని మంత్రి కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి నెలాఖరులోపు బియ్యం పంపిణీ పూర్త య్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల సరిహద్దులలోని ప్రాంతాలలో బియ్యం పంపిణీలో కొంత సమన్వయం లోపం ఏర్పడిందని, ఈ విషయాన్ని గమనించి మే నెలలో జరిగే బియ్యం పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో వ్యవహరించి ప్రతి కార్మికుడికీ ప్రభుత్వ ఫలం అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో నగరంలో ఉన్న దాదాపు 41 వేల మంది భవన నిర్మాణ కార్మికులకు క్రెడాయ్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలలోని ప్రజలకు కావాలసిన నిత్యావసర వస్తువులు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మంత్రి సూచించారు. ఆయా ప్రాంతాలలో వైద్య బృందం ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అంతేకాకుండా అవసరమైన ప్రాంతాలలో స్ప్రే చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వచ్చే నెల కార్యక్రమాల అమలుపై ముందుగానే సమగ్ర నివేదిక రూపొందించుకోవాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


logo