మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 28, 2020 , 06:29:45

ఫేస్‌బుక్‌ పరిచయంతో 9.55 లక్షలు టోపీ

ఫేస్‌బుక్‌ పరిచయంతో 9.55 లక్షలు టోపీ

  • సైబర్‌ నేరగాళ్లను నమ్మి మోసపోయిన మహిళ 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేస్‌బుక్‌లో పరిచయమైన సైబర్‌ చీటర్‌ మాటలు నమ్మిన ఓ మహిళ.. తన వద్ద ఉన్న డబ్బంతా పొగొట్టుకొన్నది. ప్రమాదవశాత్తు కొడుకు చనిపోగా అందిన రూ.10 లక్షలను సైబర్‌ చీటర్లకు ముట్టజెప్పి నిండా మునిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఒక మహిళకు ఫేస్‌బుక్‌లో జమ్మి జే పేరుతో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తాను లండన్‌లో వ్యాపారం చేస్తున్నట్లు చెప్పడంతో కొన్నాళ్లకు  స్నేహితులుగా మారారు.

ఈ క్రమంలో జనవరి నెలలో ఇండియాకు వస్తున్నానని, ఊహించనట్లుగా పెద్ద మొత్తంలో బ్రిటన్‌ పౌండ్లు, ఆభరణాలు బహుమతిగా తెస్తున్నానంటూ నమ్మబలికాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్స్‌ అధికారులు పట్టుకొన్నారని, బ్రిటన్‌ పౌండ్లు, ఆభరణాలు విడిపించేందుకు రూ.1.85 లక్షలు పన్ను చెల్లించాలంటున్నారని సదరు మహిళకు ఫోన్‌లో చెప్పాడు. మోసగాడి మాటలు నమ్మిన ఆమె.. ఆయన చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేసింది. ఆ తరువాత మళ్లీ ఫోన్‌ చేసిన చీటర్‌.. తన వస్తువులను సీజ్‌ చేసిన అధికారులు ఇప్పడే తనను వదిలిపెట్టడంతో లండన్‌ వెళ్లిపోతున్నానంటూ నమ్మించాడు.

అనంతరం ఏప్రిల్‌ నెలలో సదరు మహిళకు మళ్లీ ఫోన్‌ చేసిన మాయగాడు.. జనవరిలో నీవు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పి.. ఎయిర్‌పోర్టులో సీజ్‌ చేసిన విలువైన వస్తువులను విడిపించుకొనే ప్రయత్నం చేస్తున్నానన్నాడు. సైబర్‌ చీటర్ల మాటలను మరోసారి నమ్మిన సదరు మహిళ.. తన వద్ద ఉన్న రూ.9.55 లక్షలు విడుతలవారీగా చెల్లించింది. అయినా మరిన్ని కావాలంటూ అడుగుతుండటంతో సోమవారం సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.logo