శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 27, 2020 , 23:57:41

వైద్యసేవలను పరిశీలించిన కేంద్ర బృందం

వైద్యసేవలను పరిశీలించిన కేంద్ర బృందం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక నేతృత్వంలోని కేంద్ర అంతర్‌ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం ఉదయం నగరంలోని ఖైరతాబాద్‌ జోన్‌లో పర్యటించింది. హుమాయున్‌నగర్‌ కంటైన్మెంట్‌ జోన్‌ను సందర్శించి వైద్యసేవలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీ.ఎస్‌.లోకేశ్‌కుమార్‌ ఆయా అంశాలపై తీసుకున్న చర్యల గురించి బృందానికి వివరించారు. అనంతరం సరోజనీ దేవి కంటి దవాఖానలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ను తనిఖీ చేసింది. ఈ బృందంలో ప్రజారోగ్య శాఖ సీనియర్‌ వైద్యులు డా.చంద్రశేఖర్‌ గెడం, జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డా.హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌. ఠాకూర్‌, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేది తదితరులు ఉన్నారు.

గాంధీ దవాఖానలో 90శాతం రోగుల స్థితి సాధారణం

గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో 90శాతం మంది ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని కేంద్ర అంతర్‌ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సంతృప్తి వ్యక్తంచేసింది. దవాఖానలో సిబ్బంది కొరత కూడా లేదని, వైద్యులు, ఇతర సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. నగర పర్యటనలో భాగంగా కేంద్ర అంతర్‌ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం గాంధీ దవాఖానను సందర్శించి వివిధ విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది.


logo