బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 27, 2020 , 23:57:09

నిరాడంబరంగా ‘ఆవిర్భావం’

నిరాడంబరంగా ‘ఆవిర్భావం’

  • గులాబీ జెండాలు ఎగురవేసిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు 
  • రక్తదానం చేసిన పలువురు నేతలు

సిటీబ్యూరో/మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి  : టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు గ్రేటర్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లో నిరాడంబరంగా జరుపుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నాయకులు పార్టీ కార్యాలయాలు, ఇండ్ల వద్ద  భౌతికదూరం పాటిస్తూ జెండాలు ఎగురవేశారు. అలాగే  పలు చోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో,  మేడ్చల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి మల్లారెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మంత్రి సబితాఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌ జెండాలు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో  లేక్‌ వ్యూ బంజారా ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నవీన్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు రక్తదానం చేశారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో హబ్సిగూడ, చిలుకానగర్‌లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.  టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ వై. సతీశ్‌రెడ్డి నాగోలు బండ్లగూడలో మాస్కులను పంపిణీ చేశారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు ఆడ్ల సతీశ్‌ కుమార్‌ రచించిన ‘హైదరాబాద్‌ దిల్‌ సే సెల్యూట్స్‌ కరోనా వారియర్స్‌' ఆడియో సీడీలను ఆన్‌లైన్‌ వేదికగా ఆవిష్కరించారు. అమరవీరుల కుటుంబాల వేదిక ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జరుపుల నరేశ్‌ నాయక్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులు, తెలంగాణ వాదులకు శుభాకాంక్షలు తెలిపారు.


logo