బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 27, 2020 , 00:22:04

లాక్‌డౌన్‌లో రంజాన్‌

లాక్‌డౌన్‌లో రంజాన్‌

  • ప్రార్థనలకు సరిపడా సమయం 
  • కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్‌
  • 12 గంటల పాటు నిత్యావసరాల దుకాణాలు  
  • డ్రై ఫ్రూట్స్‌, పండ్లకు ఢోకా లేదు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/చార్మినార్‌ : ఆకాశంలో నెలవంక దర్శనమిచ్చింది. ఆధ్యాత్మిక సౌరభానికి తెర లేసింది.  శనివారం నుంచి  రంజాన్‌ దీక్ష ఆరంభమైంది. రాత్రి తరావీహ్‌ నమాజులో ఖురాన్‌ను సంపూర్ణంగా వినేందుకు, ఇఫ్తార్‌ చేసేందుకు నెల రోజుల గడువు ఉంటుంది. ఐతే కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీటికి బ్రేక్‌ పడనున్నది. రంజాన్‌ నెలంతా ఇంటి పట్టునే ఉండి నమాజు చేయాలని,  కుటుంబ సభ్యులతో కలిసి ఖురాన్‌ పారాయణం చేయాలని మత పెద్దలు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌తో దైవారాధన చేసేందుకు సరిపడా సమయం లభించనున్నది. వ్యాపారులకు మినహా సామాన్యులెవరికీ పెద్దగా ఇబ్బందులు లేవు. మసీదుల్లో ప్రార్థనలు చేయలేకపోతున్నామనే ఆవేదన మాత్రం మిగిలిందని  ఇస్లామిక్‌ రచయిత మహ్మద్‌ ముజాహిద్‌ అభిప్రాయపడ్డారు. 

12 గంటల పాటు దుకాణాలు..

రంజాన్‌ నేపథ్యంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు  షాపులు అందుబాటులో ఉన్నాయి. వస్త్ర దుకాణాలు మూసివేయడంతో మదీనా మార్కెట్‌ బోసిపోయింది. లాడ్‌బజార్‌లో గాజుల చప్పుళ్లు లేక నిశ్శబ్దం ఆవహించింది. రూ.వందల కోట్ల వ్యాపారం అటకెక్కింది. 

విరివిగా జకాత్‌..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జమాతే ఇస్లామీ హింద్‌ ముందుగానే జకాత్‌ దానాలను ప్రారంభించింది. మొత్తంగా రూ.3.60 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. ఇలా పలు సంస్థలు జకాత్‌కు ముందుకొస్తున్నాయి. తమ సంపదలో రెండున్నర శాతం లెక్కించి జకాత్‌ పద్దులో పేదలకు దానమిస్తారు.

నాకు ఇదే అసలైన రంజాన్‌

ఓ ఇంజినీర్‌కు ఆధ్యాత్మిక భావం ఎక్కువ. రోజూ ప్రార్థనలు చేయడం అలవాటు. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష చేయాలని తపన పడేవాడు. కానీ తన వృత్తిలో తప్పనిసరి ఎండలో పని చేయాల్సిన పరిస్థితి. దీంతో ఉపవాస దీక్షకు ప్రతికూలంగా ఉండేది. కానీ లాక్‌డౌన్‌లో ఆ వృత్తికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఇప్పుడు ఉపవాస దీక్ష ఆరంభించాడు.  అసలైన రంజాన్‌ తనకు ఇదేనని సంతోషపడుతున్నాడు. 

ఇఫ్తార్‌కు దూరంగా 

గతేడాది కంటే కాస్త భిన్నంగా గడపాలి. ఇఫ్తార్‌లో ఖర్చు తగ్గించుకోండి.  కూలీలు, నిరుపేదలు, అనాథలు, అభాగ్యుల కోసం ఆ డబ్బును వెచ్చించాలి.  కరోనా కట్టడి కోసం ఇఫ్తార్‌ విందు కుటుంబ సభ్యులతోనే చేయండి.  మితాహారమే తీసుకోవాలి. 

- మహ్మద్‌ ముజాహిద్‌, ఇస్లామిక్‌ రచయిత


logo