సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 27, 2020 , 00:16:18

ప్రతిపల్లెలో ధాన్యం కొనుగోలు

ప్రతిపల్లెలో ధాన్యం కొనుగోలు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలోని అవకాశం ఉన్న ప్రతి పల్లెలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని  61 గ్రామాల్లో వరి       సాగుచేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జిల్లాలో ముందస్తుగా 10 (ఏదులాబాద్‌, ప్రతాపసింగారం, లక్ష్మాపూర్‌, కేశవరం, కీసర, శామీర్‌పేట, పూడూరు, ఉద్దమర్రి, మేడ్చల్‌, మదారం) ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటివరకు సుమారు 841 మంది రైతుల నుంచి 3070 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సుమారు 208 పైచిలుకు మంది రైతులకు రూ.5.63కోట్లను డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్‌ మేనేజర్‌ జితేందర్‌ తెలిపారు. సోమవారం వరకు సుమారు 500 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. 

గ్రామాల్లోనే కొనుగోలు

కొందరు రైతులు నేరుగా మార్కెట్లకు ధాన్యం తీసుకువస్తుండగా, తీసుకురాలేని వారి గ్రామాల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ తెలిపారు. అలాగే కరోనా నియంత్రిత ప్రాంతాల్లోని ధాన్యాన్ని రైతులు పొలం వద్ద నుంచి నేరుగా మిల్లుల వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చీర్యాల్‌ గ్రామాన్ని కరోనా నియంత్రిత ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో గ్రామంలోని ధాన్యాన్ని మిల్లు వద్దకు చేర్చి అక్కడే కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోల్చితే జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు కొంత వరకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధరను అందిస్తున్నదని, ఎట్టి పరిస్థితుల్లోను దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1835 ఉందని, సాధారణ రకానికి రూ.1815 ఉందని, రైతులు ధాన్యాన్ని విక్రయించిన ఒకటి రెండు రోజుల్లోనే నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదును జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 


logo