మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 27, 2020 , 00:15:51

ప్రభుత్వ చర్యలు భేష్‌

ప్రభుత్వ చర్యలు భేష్‌

  • సిటీలో కేంద్ర బృందం పర్యటన
  • వైద్యులు, సిబ్బందికి అభినందన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో కేంద్ర బృందం ఆదివారం విస్తృతంగా పర్యటించింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక నేతృత్వంలో కేంద్ర అంతర్‌ మంత్రిత్వశాఖల అధికారుల బృందం పలు ప్రాంతాలను సందర్శించింది. ఓల్డ్‌ మలక్‌పేటలోని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పర్యటించిన బృందానికి నగర అదనపు పోలీస్‌ కమిషనర్‌ చౌహాన్‌ వివరాలు తెలియజేశారు. నియంత్రిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. అక్కడి ప్రజల నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు...బారికేడ్ల ఏర్పాటును  కేంద్ర బృందం పరిశీలించింది. ఓల్డ్‌మలక్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుసుకున్న అధికారులు, ఎలా వచ్చింది, ఎక్కడక్కెడకు వెళ్లారు అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం మలక్‌పేట కంటైన్మెంట్‌ జోన్‌ను పరిశీలించారు. 

మెహిదీపట్నం రైతు బజార్‌లో...

మెహిదీపట్నం రైతు బజార్‌ను సందర్శించిన కేంద్ర బృందం సభ్యులు అక్కడ ఉన్న కిరాణాషాపు యజమానితో మాట్లాడారు. సామాజిక దూరాన్ని అమలు చేసేందుకు కూరగాయల దుకాణాల ముందు ఏర్పాటు చేసిన బాక్సులను పరిశీలించారు. రైతుబజార్‌కు 20 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా షాబాద్‌, మొయినాబాద్‌ నుంచి కూరగాయలు ఎలా తీసుకువస్తున్నారో వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలపై కూరగాయలు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొబైల్‌ రైతు బజార్‌ ద్వారా విక్రయిస్తున్న క్యాప్సికమ్‌, చిక్కుడు, క్యాబేజీ, సోరకాయ, దోసకాయల ధరల గురించి కేంద్ర బృందం వాకబు చేసింది. నగరంలో మొత్తం 120 మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య అధికారులకు వివరించారు.

వైద్య సేవలకు అభినందన

ప్రకృతి చికిత్సాలయంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ క్వారంటైన్‌ను కేంద్ర బృందం తనిఖీ చేసింది. వైద్యులు, వైద్య సిబ్బందితో  మాట్లాడటంతోపాటు వసతులు, పరీక్షలు చేసే కిట్‌లను పరిశీలించింది. క్వారంటైన్‌లో ఉంచిన వ్యక్తులకు వైద్య ప్రమాణాల ప్రకారం పోషకాహారం అందించినట్లు హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి వివరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలను జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక అభినందించారు. కేంద్ర బృందంలో కేంద్ర ప్రజా ఆరోగ్యశాఖ సీనియర్‌ వైద్యులు, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ ఠాకూర్‌, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేది ఉండగా, వీరితోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo