మంగళవారం 02 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 23:56:47

కష్టమైనా ఇష్టంతో..

కష్టమైనా ఇష్టంతో..

  • వైద్యవృత్తికే వన్నె తెస్తున్న డాక్టర్లు 
  • కుటుంబానికి దూరంగా... ప్రజా సేవే అభిమతంగా విధులు 
  • ఆదర్శంగా నిలుస్తున్న వైద్యదంపతులు  

వైద్యుల త్యాగాలు గొప్పవి... వెలకట్టలేనివి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో  ప్రాణాలకు తెగించి.. కష్టాలకు ఓర్చుకొని.. నిబద్ధతతో పనిచేస్తున్న వీరి రుణం తీర్చుకోలేనిది.  ఈ ఆపత్కాలంలో కొందరు వైద్యదంపతులూ తమ కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ.. మొక్కవోని ధైర్యంతో రేయింబవళ్లు  శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. కొవిడ్‌ను నియంత్రించేందుకు అవిశ్రాంతంగా సేవలందిస్తూ..వైద్య వృత్తికే వన్నె తెస్తున్నారు. 

పారామెడికల్‌ సిబ్బంది సైతం..

హఫీజ్‌పేట్‌: కరోనా వ్యాప్తి అరికట్టడంలో పారామెడికల్‌ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ముఖ్యంగా రోగులను గుర్తించడం మొదలు.. బాధితుల కారణంగా వైరస్‌ సోకిన ఇతరుల వివరాలు సేకరించడంలో వీరు కీలకపాత్ర వహిస్తున్నారు. బంధుత్వాలకు దూరంగా ఉంటూ.. సేవల్లో నిమగ్నమవుతున్నారు.

దేవుడిచ్చిన అవకాశంగా భావించి... 

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి, గాజుల రామారం సర్కిల్‌లో పారిశుధ్య విభాగంలో ఏఎంహెచ్‌వోగా డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి డాక్టర్‌ సత్యరత్న గాంధీ వైద్యశాలలో ఆర్‌ఎంవో. భార్యాభర్తలు కరోనా కట్టడి కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. వీరికి రెండో తరగతి చదువుతున్న కూతురు ఆరాధ్య, 7వ తరగతి చదువుతున్న కొడుకు అభ్యాస్‌ సంతానం. మహమ్మారి నివారణకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఈ ఇద్దరు వైద్య దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తమ వంతు పాత్రపోషిస్తూ...

యూసుఫ్‌గూడ: సృజన, చంద్రశేఖర్‌రావు దంపతులు శేరిలింగంపల్లిలో ఉంటారు. వీరికి కుమారుడు సంతానం. సృజన శంషాబాద్‌ డీఎంహెచ్‌వోలో,   చంద్రశేఖర్‌రావు గాంధీ వైద్యశాలలో వైద్యాధికారులుగా పనిచేస్తున్నారు. కరోనా కట్టడిలో ఈ వైద్య దంపతులు తమ వంతు పాత్రపోషిస్తున్నారు. విధులకు వెళ్లి  ఇంటికి చేరుకునే సరికి రాత్రి 10గంటలు అవుతుంది. కుమారుడి బాధ్యతలను డాక్టర్‌ సృజన మామ చూసుకుంటున్నారు. కరోనా భయంతో పని మనిషిని సైతం కొన్ని రోజులు పనికి రావద్దని సూచించి ముందుగానే ఆమెకు జీతం చెల్లించారు. 

ఆత్మ సంతృప్తి... 

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బారి నుంచి ప్రజలను కాపాడుకోవడానికి చేస్తున్న సేవ ఆత్మ సంతృప్తినిస్తుంది. నాతో పాటు నా భార్య ఈ వైద్య వృత్తిలో ఉండడం దేవుడు మాకిచ్చిన మంచి అవకాశంగా భావిస్తున్నాం. దేశం, రాష్ట్రం నుంచి కరోనాను పారద్రోలడానికి నిత్యం శ్రమిస్తున్నాం.

-చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో 

మానసిక స్థితి ఆధారంగా...  

కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగి మానసిక ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో మసులుకుంటున్నాం. పాజిటివ్‌ కేసు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్త్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం.వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేస్తున్న విశేష కృషిలో మేము సైతం పాల్గొనడం ఆనందంగా ఉంది. 

-డాక్టర్‌ చంద్రశేఖర్‌రావు, గాంధీ వైద్యుడు

భయపడితే  వైద్యం చేయలేం..

భయపడితే ప్రజలు, రోగులకు వైద్యసేవలు అందించలేం. నేను పని చేస్తున్న ఏరియాలో 32   పాజిటివ్‌ కేసులు వచ్చాయి.   ఆరుగురిని డిశ్చార్జి చేశాం. కరోనా సమయంలో మీరు మా వద్దకు రాకపోయిన పర్వాలేదు కానీ.. ప్రజలకు వైద్య సేవలందించాలని నాన్న ప్రోత్సహిస్తున్నారు.  

 -డాక్టర్‌ సృజన 

కష్టాలు చూస్తే...

 కరోనా సోకిన వ్యక్తులను దవాఖానకు తరలించడం, ఇంటింటి సర్వే, క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించడం వంటి పనులు చేస్తు న్నా. ప్రస్తుత పరిస్థితుల్లో బాబు నా వద్ద ఉంటే శ్రేయస్కరం కాదని మా సొంతూరికి పంపించాను. అక్కడ బాబును ఓదార్చడంలో మా ఆయన పడుతున్న కష్టాలు చూస్తే బాధేస్తుంది. అయినా బాబు శ్రేయస్సు దృష్ట్యా తప్పని పరిస్థితి. ఆ పసి హృదయం రోదిస్తున్నా మరో మార్గం లేని దయనీయ స్థితి.  

-సురేఖ,ఏఎన్‌ఎం, హఫీజ్‌పేట్‌ యూపీహెచ్‌సీచ్‌సీ

వీడియో కాల్‌లో మాట్లాడుతున్నా..

కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండేందుకు మా రెండేండ్ల బాబును మా అత్తయ్య, మా ఆయన దగ్గర వదిలేసి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నా. బాబు గుక్కపట్టి ఏడ్చినప్పుడల్లా మా ఆయన వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిస్తున్నాడు. నా జీవితంలో ఇలాంటి కఠినమైన పరిస్థితి ఎరుగను. నాలాగా విధులు నిర్వర్తించే వాళ్లందరం ఒకచోట రూం అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నాం. మా వల్ల కుటుంబంలోని వారెవరికీ ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.

- జ్యోతి, ఏఎన్‌ఎం, హఫీజ్‌పేట్‌


logo