బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 02:46:16

మరో 50 ‘అన్నపూర్ణ’ సెంటర్లు

మరో 50 ‘అన్నపూర్ణ’ సెంటర్లు

  • 300 కేంద్రాల్లో రోజూ 2 లక్షల మందికి భోజనం 
  • జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఎవరూ ఆకలితో ఉండకుండా చర్యలు 
  • భోజనం అవసరమనుకుంటే కాల్‌సెంటర్‌ నంబర్‌  2111 1111కు ఫోన్‌ చేయాలి
  • ‘అన్నపూర్ణ’ కేంద్రం సందర్శనలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో మరో 50 అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఎవరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో 300 అన్నపూర్ణ సెంటర్లలో దాదాపు రెండు లక్షల మందికి రోజూ భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌లతో కలిసి టౌలిచౌకీలోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ, 9 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి గంటన్నరపాటు, సాయంత్రం 5 గంటలకు మరోసారి భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్‌ పేర్కొన్నారు. నిత్యం దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి సర్కిల్‌లో ఒక ప్రత్యేక రెడిమేడ్‌ కుకుడ్‌ ఫుడ్‌ వాహనాన్ని సిద్ధంగా ఉంచామని, అవసరం ఉన్న చోటకు వెంటనే అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ నంబర్‌ 2111 1111 కాల్‌ చేయాలని సూచించారు. భోజనం విషయమై ప్రభుత్వానికి సహకారం అందించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎస్‌ కోరారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. 


logo