శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 02:43:38

ఆ నలుగురూ.. కరువయ్యారు!

ఆ  నలుగురూ..  కరువయ్యారు!

  • అనాథ శవాలుగా కరోనా బాధిత మృతులు
  • కడచూపు కోసం కూడా రాని కుటుంబీకులు 
  • అన్నీతానై దహన సంస్కారాలు చేస్తున్న బల్దియా
  • శ్మశానవాటికల వద్ద స్థానికుల వ్యతిరేకత
  • దహనం చేసేందుకు కూడా ఒప్పుకోని వైనం
  • ప్రభుత్వ స్థలాన్ని చూపాలంటూ కలెక్టర్లకు జీహెచ్‌ఎంసీ లేఖ

‘బంధాలు, బంధుత్వాలు అన్నీ ఓ మాయ, పోయేనాడు ఎవరూ తోడు రారు’ అనడం తరచూ వింటుంటాం. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో పరిస్థితి ఇంతకన్నా అధ్వానంగా తయారైంది. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడంలేదు. అనాథ శవాల మాదిరిగా దవాఖానల్లోనే వదిలేస్తున్నారు. నగరానికి చెందిన వారే కాదు, వివిధ జిల్లాల వారు కూడా శవాలను చూసేందుకు రావడంలేదు. దీంతో వారి దహన సంస్కారాల బాధ్యతను జీహెచ్‌ఎంసీ తమ భుజాలకెత్తుకున్నది. మరోవైపు, శవాలను దహనం చేసేందుకు కూడా దహనవాటికల పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఒప్పుకోవడంలేదు. దీంతో బల్దియా సిబ్బందికి దహన సంస్కారాల నిర్వహణ ఓ సమస్యగా మారింది. ఎవరూ వ్యతిరేకించకుండా ఉండే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉంటే చూపాలంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా బారినపడి మరణించినవారి దహన సంస్కారాల నిర్వహణకు ఇదివరకే ప్రభుత్వం ఆయా మతాలవారీగా మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం దహన సంస్కారాలకు కుంటుంబంలోని ఐదుగురు సభ్యులను అనుమతిస్తారు. అయితే వారు పూర్తి రక్షణ చర్యలు పాటిస్తూ దూరంగా ఉండి మాత్రమే శవాన్ని చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులే చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 22 మంది కరోనాతో మృతి చెందగా, ఇందులో   ఆరుగురు హిందువులు, మిగిలినవారు ముస్లిం మతానికి చెందినవారు ఉన్నారు. ముస్లిం మతస్తులను ఎర్రగడ్డ, ఆసిఫ్‌నగర్‌లతోపాటు పాతబస్తీలోని వివిధ శ్మశానాల్లో సమాధి చేస్తున్నారు. హిందువుల దహన సంస్కారాలే సమస్యగా మారింది. బంజారాహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఒకరికి, ఎర్రగడ్డలో ఇద్దరికి, లాలాపేట్‌లో ఒకరికి, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇద్దరికి దహన సంస్కారాలు నిర్వహించారు.  అల్వాల్‌, అంబర్‌పేట్‌, బన్సీలాల్‌పేట్‌ తదితర శ్మశానవాటికలకు తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులతోపాటు ఆయా శ్మశానవాటికల నిర్వాహకులు వ్యతిరేకించారు. ఇప్పటివరకు నిర్వహించిన దహన సంస్కారాలు కూడా అతి కష్టం మీద నిర్వహించినట్లు, కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు ఎవరూ ఒప్పుకోవడం లేదని ఓ అధికారి తెలిపారు. పోలీసుల సాయంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గుట్టల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో దహనం చేస్తున్నా స్థానికులు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత బుధవారం రెండు మృత దేహాలను అంబులెన్స్‌లలో అబ్దుల్లాపూర్‌మెట్‌కు తరలించగా అక్కడ స్థానిక నాయకులతోపాటు కొందరు గ్రామస్తులు వ్యతిరేకించారని, అయితే అప్పటికే దహన సంస్కారాలు పూర్తికావడంతో మరోసారి ఇక్కడికి శవాలను తేవద్దంటూ వారు హెచ్చరించారన్నారు. దీంతో చేసేదిలేక జీహెచ్‌ఎంసీ అధికారులు కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు ఎవ్వరూ వ్యతిరేకించని ప్రభుత్వ స్థలం ఎక్కడుందో చూపాలంటూ రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. 

శవాలను వదిలేసి వెళ్తున్నారు.. 

కరోనా మృతుల్లో నగరంతోపాటు నల్గొండ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌, రంగారెడ్డి తదితర జిల్లాలకు చెందినవారు ఉన్నారు. అయితే, ఇందులో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఎవరూ కనీసం దహన సంస్కారాలకు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. చనిపోయిన వార్త తెలుసుకున్న వెంటనే కొందరు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసుకుంటున్నారని, తాము కోరినా వారు రావడంలేదన్నారు.మృత దేహాలవద్దకు వచ్చేముందు బంధువులకు అవసరమైన రక్షణ చర్యలు పాటిస్తామని చెబుతున్నా ఎవరూ వినడంలేదని వారు పేర్కొన్నారు. కనీసం చివరి చూపునకు కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అధికారులు చెప్పారు. ముస్లింలను పూడ్చేందుకు కూడా మొదలు ఆయా శ్మశానవాటికల నిర్వాహకులు, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యకమైనప్పటికీ పాతబస్తీలోని ఎమ్మెల్యేల జోక్యంతో ఇప్పుడు సమస్య తీరిపోయిందని అధికారులు తెలిపారు.

పనిచేయని దహన వాటికలు ..

వాస్తవానికి జీహెచ్‌ఎంసీలో అంబర్‌పేట్‌, ఎర్రగడ్డ, బన్సీలాల్‌పేట్‌, పంజాగుట్ట తదితర చోట్ల నాలుగు విద్యుత్‌ దహనవాటికలు ఉన్నాయి. అయితే నిర్వహణలోపం కారణంగా చాలాకాలంగా అవి పనిచేయడంలేదు. దీంతో జనం సంప్రదాయ పద్ధతుల్లోనే కట్టెలతో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కనీసం వీటిని మరమ్మతు చేయించి ఉపయోగంలోనికి తెద్దామంటే సంబంధిత ఇంజినీర్లు ఇప్పుడు అందుబాటులో లేరని, అది ఇప్పట్లో అయ్యేపనికాదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇవి పనిచేస్తే పది నిమిషాలకు ఒకటి చొప్పున శవాలను దహనం చేసే వీలు కలుగుతుందని, కరోనా మృతుల దహనానికి ఇబ్బంది ఉండేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా  మానవ సంబంధాలకు కూడా పరీక్ష పెడుతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 

కలకలం రేపిన దహన సంస్కారాలు 

కవాడిగూడ : కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి అంత్యక్రియలు అధికారులు గుట్టుగా నిర్వహించడం కవాడిగూడలో కలకలం రేపింది. సికింద్రాబాద్‌ సింధికాలనీలో నివాసం ఉండే వ్యక్తి(55) కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు రాజస్థానీ కావడంతో కవాడిగూడలోని రాజస్థానీ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. గురువారం రాత్రి 8గంటల సమయంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది ధరించిన డ్రెస్‌లు చూసి ఆందోళనకు గురైన పరిసర బస్తీల ప్రజలు దహన సంస్కారాలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా, పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం పరిసర బస్తీల వాసులకు శ్మశాన వాటిక బయట పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు దర్శనమివ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న గాంధీనగర్‌ ఎస్‌ఐ రవీందర్‌ అతను కరోనాతో చనిపోలేదని తెలిపారు. గురువారం రాత్రి కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలే జరిగాయని, శ్మశాన వాటిక సిబ్బంది తమకు చెప్పారని స్థానికులు పేర్కొన్నారు. అంత్యక్రియలో సిబ్బంది ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు నిర్లక్ష్యంగా వదిలివెళ్లడం వల్ల వైరస్‌ వ్యాపించదా అని స్థానికులు ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికతోపాటు పరిసర బస్తీల్లో క్రిమి సంహారక మందులు చల్లించాలని స్థానికులు కోరగా, వెంటనే స్పందించిన ఎస్‌ఐ జీహెచ్‌ఎంసీ సిబ్బందిని పిలిపించి శ్మశాన వాటికలో బయట వదిలివెళ్లిన పీపీఈ కిట్లను, గ్లౌజ్‌లను, మాస్కులను తొలిగించి క్రిమిసంహారక మందులు చల్లించారు.


logo