గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 02:40:22

ఆ మున్సిపాలిటీల్లో కరోనా లేదు

ఆ మున్సిపాలిటీల్లో కరోనా లేదు

మణికొండ, నమస్తే తెలంగాణ: రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా చేపడుతున్నారు. బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని పీఅండ్‌టీ కాలనీ-3, నర్సారెడ్డికాలనీ-2, రాజపుష్పా ఆట్రీయా-4, హాల్‌మార్క్‌ అపార్టుమెంట్‌-1 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో ఈ ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్లుగా గుర్తించారు. మొత్తం 10 కేసులు నమోదు కావడంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో ఐదుగురు బాధితులు ఇటీవల క్వారంటైన్‌ పూర్తిచేసుకుని పరీక్షలు నెగిటివ్‌ రావడంతో వారిని ఇండ్లకు చేర్చి హోంక్వారంటైన్‌ చేశారు. ప్రాంతాల్లోని మెడికల్‌ షాపుల్లో దగ్గు, జ్వరం, జలుబులకు సంబంధించి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించిన గాంధీ దవాఖాన వైద్యులు 19 మంది నుంచి నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు చేశారు. 

మణికొండ మున్సిపాలిటీ పరిధి నుంచి 10మందికి కరోనా పరీక్షలు చేశారు. శుక్రవారం వారికి సంబంధించిన రిపోర్టులను అధికారులు వెల్లడించారు. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన క్షేత్రస్థాయి కరోనా పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని, జంట మున్సిపాలిటీలు కరోనా ఫ్రీ ప్రాంతాలుగా ప్రకటించినట్లు వైద్యశాఖ నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. అదేవిధంగా బండ్లగూడ మున్సిపాలిటీల పరిధిలోనూ మెడికల్‌షాపుల ఆధారంగా అనుమానితుల ద్వారా కరోనా వైద్యపరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శంషాబాద్‌ మండలం, మున్సిపాలిటీలో ఇప్పటికే ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం, రాజేంద్రనగర్‌ పట్టణ ప్రాంతంలోనూ ఇదే తరహా పరీక్షలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కరోనాను జయించారు... 

శామీర్‌పేట /మణికొండ: ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారితో పోరాడి గెలిచారు వారు. అధికారుల సహకారం, వైద్యుల చికిత్సతో పాటు వారందించిన కొండంత ధైర్యంతో కోలుకున్నారు. ఆరోగ్యవంతులై ఇంటికి చేరారు.  మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లికి చెందిన ఓ యువకుడు మార్చి 19న గ్రామంలో గజ్వేల్‌కి చెందిన వ్యక్తితో కలిసి ప్రార్థనకు వెళ్లాడు. అక్కడికి మరో 18 మంది హాజరయ్యారు. గజ్వేల్‌ వాసికి కరోనా పాజిటివ్‌ రావడంతో అందరిని రాజేంద్రనగర్‌ క్వారంటైన్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో తుర్కపల్లి యువకుడికి సైతం వైరస్‌ సోకింది. గాంధీ దవాఖానలో 20 రోజుల పాటు చికిత్స అందించారు. రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా, అతడికి నెగిటివ్‌ రావడంతో 22న రాత్రి డిశ్చార్జి చేశారు. 28 వరకు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా, తాను వైద్యులకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని, సుమారు 20 రోజులు బాగా చూసుకున్నారని ఆనందం వ్యక్తం చేశాడు ఆ యువకుడు. కరోనా వచ్చిందనే భయం ఉన్నా.. డాక్టర్లు ఇచ్చిన ధైర్యం, అందించిన సేవలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయన్నాడు. అలాగే కోకాపేటలోని ఓ అపార్టుమెంటులో నివాసముంటున్న  దంపతులకు వారి ఇద్దరు పిల్లలకు సైతం కొవిడ్‌-19 బారినపడ్డారు.  14 రోజలు పాటు గాంధీలో చికిత్స పొందిన వీరందరికీ తాజాగా నెగెటివ్‌ రిపోర్టు రావడంతో డిశ్చార్జి చేశారు. 

షెల్టర్‌హోమ్‌ను తనిఖీ చేసిన మేయర్‌

అబిడ్స్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వలస కార్మికులు, అనాథలు, యాచకుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్‌హోమ్‌ను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వాకబు చేశారు. అన్నపూర్ణ మొబైల్‌ క్యాంటీన్‌ ద్వారా అందిస్తున్న భోజనాన్ని  కార్మికులకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 4600మంది వలస కార్మికులు, యాచకులు, అనాథలకు 27 కేంద్రాల్లో ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు షెల్టర్‌హోమ్‌లోనే ఉండాలని వారికి మేయర్‌ సూచించారు.


logo