శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 02:38:39

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పకడ్బందీగా కరోనా కట్టడి

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పకడ్బందీగా  కరోనా కట్టడి

  • రేయింబవళ్లు శ్రమిస్తున్న అధికార యంత్రాంగం
  • కృషికి తగిన ఫలితాలు
  • కొన్ని చోట్ల  కంటైన్మెంట్‌ ఏరియాల ఎత్తివేత 

కంటికి కనిపించని వైరస్‌ కట్టడికి అధికార యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తున్నది. లాక్‌డౌన్‌తో మహమ్మారిపై యుద్ధం చేస్తున్నది. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఏర్పాటైన కంటైన్మెంట్‌ జోన్లతో సత్ఫలితాలిస్తున్నవి. ఆ ఏరియాల్లో ప్రజలను బయటికి రానివ్వకుండా... ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు. ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచి పాలు, కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువులను నేరుగా ఇంటికే పంపిస్తున్నారు.  ప్రజలందరి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ఇంట్లోనే క్వారంటైన్‌ చేస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని వైద్యశాలకు పంపిస్తున్నారు. మొత్త్తానికి జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, వైద్య ఆరోగ్య విభాగం సిబ్బంది చేస్తున్న  కృషికి తగిన  ఫలితాలు వస్తున్నవి. కొవిడ్‌-19ను విజయవంతంగా నిరోధించగలుగుతున్నారు. పరిస్థితులు క్రమంగా చక్కపడుతుండడంతో కొన్ని చోట్ల నియంత్రిత ప్రాంతాలను ఎత్తివేస్తున్నారు. 

  • కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఐదు ప్రాంతాల్లో  మాత్రమే కొనసాగుతున్నాయి. వెస్ట్‌జోన్‌ పరిధిలో 14 కంటైన్మెంట్‌  జోన్లు ఏర్పాటు చేశారు. అయితే గడిచిన 15 రోజుల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో శుక్రవారం తొమ్మిది నియంత్రిత ప్రాంతాలను  ఎత్తివేశారు.
  • జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ జోన్‌లో మొత్తం ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ రాగా, ఆయా ఏరియాలను నియంత్రిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు.  100 నుంచి 120 గృహాలను పూర్తిగా బారికేడింగ్‌ చేసి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఎనిమిదిలో నాలుగు నియంత్రిత ప్రాంతాలను ఎత్తివేశారు.
  • మల్కాజిగిరి సర్కిల్‌లో 3 నియంత్రిత ప్రాంతాల్లో ఒకటి ఎత్తివేశారు. సర్కిల్‌లో షాదుల్లానగర్‌, జవహర్‌నగర్‌, శ్రీకాలనీలో పాజిటివ్‌ కేసుల నమోదుతో నియంత్రిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. షాదుల్లానగర్‌లో పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు చికిత్స పొంది డిశ్చార్జి కావడంతో నియంత్రిత ప్రాంతాన్ని ఎత్తివేశామని  డీసీ దశరథ్‌ తెలిపారు.
  • సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో మూడు నియంత్రిత ప్రాంతాలను అధికారులు తొలగించారు. బారికేడ్లను తీసివేశారు. బౌద్ధనగర్‌, శ్రీనివాస్‌నగర్‌ నార్త్‌లాలాగూడలో ప్రధానరోడ్డుకు చేరుకోవడానికి ఎక్కువ మార్గాలు ఉంటే వాటిని తొలగించకుండా రాకపోకలకు ఒకటే మార్గం ఉండేలా చేస్తున్నారు.
  • ఖైరతాబాద్‌ జోన్‌  పరిధిలో మొత్తం 152 వరకు కరోనా పాజిటివ్‌ కేసులు కాగా 47 వరకు కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నియంత్రిత ప్రాంతాల నుంచి ఎవరూ  బయటకు రాకుండా, లోపలికి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.   

సామాజిక దూరం పాటించాలి

కరోనా మహమ్మరిని పారద్రోలాలంటే కఠినంగా లాక్‌డౌన్‌ పాటించాలి.  ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాకండి. అత్యవసర పనులు ఉండి బయటకు వచ్చినా సామాజిక దూరం పాటించాలి. మాస్కులు ధరించండి. జోన్‌ వ్యాప్తంగా పారిశుధ్య పనులతో పాటుగా కరోనా కట్టడి కోసం  పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 

-ఉపేందర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌  

 బయటకు రాకండి

  • ఎమ్మెల్యే వివేకానంద్‌

రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గే వరకు ప్రజలు బయటికి రాకుండా ఇండ్లకే పరిమితం కావాలని ఎమ్మెల్యే వివేకానంద్‌ సూచించారు.  కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని అపురూపకాలనీ, మోడీబిల్డర్స్‌, సుభాశ్‌నగర్‌ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ఆయా ప్రాంతాలను సందర్శించారు. అనంతరం అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. ప్రజల సహకారం, అధికారుల సమష్టి కృషితోనే కరోనా కట్టడి సాధ్యమైందన్నారు.  నిత్యావసర సరుకుల విషయంలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం

 కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తుల కుటుంబంతోపాటు ప్రభావితమయ్యే చుట్టు పక్కల ఇండ్లను కలిపి కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ, గాజుల రామరానికి చెందిన ఇద్దరు మాత్రమే ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. కంటైన్మెంట్‌ జోన్‌లో 24 గంటలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.                    

- వి.మమత, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ 


logo