గురువారం 28 మే 2020
Hyderabad - Apr 24, 2020 , 00:45:25

హకీంపేట అనువైన చోటు

 హకీంపేట అనువైన చోటు

  • క్రీడానగరం నిర్మాణానికి అనుకూలం
  • రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌లో 181 ఎకరాల్లో స్థలం 

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పారిశ్రామిక ప్రాంతంగా, ఐటీ సెజ్‌లకు కేరాఫ్‌గా విరాజిల్లుతున్న మేడ్చల్‌ జిల్లాకు అన్నీ అనుకూలిస్తే క్రీడాకారుల స్వర్గధామంగా సైతం కీర్తి పొందే అవకాశాలున్నాయి.  సమగ్ర క్రీడా విధానంతో పాటు క్రీడా నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. విధివిధానాల అధ్యయనం కోసం మంత్రులతో క్యాబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి స్థలాన్ని కూడా ఈ సబ్‌ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశముండడంతో అన్నింటికీ అనువుగా ఉన్న జిల్లాలోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఇప్పుడు మరింత ప్రాముఖ్యత పెరిగింది. రాజధాని నగరానికి అత్యంత సమీపంలో, రాజీవ్‌ రహదారి పక్కనే ఉండడమే కాకుండా స్థలం లభ్యత కూడా కలిసొచ్చే అంశంగా మారింది.  

206.5 ఎకరాల్లో...

గ్రామీణ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి భావిభారత క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 1993లో అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా (ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లా)లోని శామీర్‌పేట మండలం, హకీంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 206.5 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన హంగులతో రాష్ట్ర క్రీడా పాఠశాలను ఏర్పాటు చేసింది. క్రీడా సామగ్రితో పాటు సకల సౌకర్యాలతో 10+2వరకు తరగతి గదులు, 1400 మీటర్ల అథ్లెట్‌ ట్రాక్‌, రెండు ఇండోర్‌ స్టేడియాలు, 1 ఫుట్‌బాల్‌ స్టేడియం, 144 గదులతో వసతి గృహాలు, 16 తరగతి గదులు, రెండు కాన్ఫరెన్స్‌ హాళ్లు, వాలీబాల్‌ గ్రౌండ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ హాల్‌, ఆర్చరీ మైదానం, విశాలమైన డైనింగ్‌ హాల్‌ను నిర్మించారు. కాగా, ఈ స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణ  కేవలం 25 ఎకరాల్లోనే జరుగుతున్నది. మిగిలిన 181 ఎకరాల్లో స్పోర్ట్స్‌ సిటీ నిర్మించుకునేందుకు అనుకూలంగా ఉన్నది. 

424 మంది విద్యార్థులు... 

ప్రస్తుతం స్కూల్‌లో మొత్తం 424 మంది విద్యార్థులుండగా, 66 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 22 మంది కోచ్‌లు, 13 మంది టీచర్లు, 21 మంది రెసిడెన్షియల్‌ స్టాఫ్‌, ఏడుగురు అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగులు, ముగ్గురు మెడికల్‌ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఆర్చరీ, అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, ఫెన్సింగ్‌, జిమ్నాస్టిక్‌, జూడో, వాటర్‌ స్పోర్ట్స్‌, సెపక్‌ తక్రా, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌ వంటి సుమారు 11 క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు.logo