శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 24, 2020 , 00:31:22

గ్రేటర్‌లో 13 కేసులు

గ్రేటర్‌లో 13 కేసులు

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: నగరంలో గురువారం 13పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ నగరంలో 11కేసులు నమోదవగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. నగరంలోని పాతబస్తీలో 7కేసులు, ఇతర ప్రాంతాల్లో 4కేసులు నమోదవగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మియాపూర్‌లో ఒకటి, మేడ్చల్‌లో ఒక కేసు నమోదయ్యాయి.

సుల్తాన్‌బజార్‌/ముషీరాబాద్‌: విద్యానగర్‌లోని లలితానగర్‌కు చెందిన వృద్ధుడు(60) బుధవారం ఉదయం షుగర్‌ వ్యాధితో బాధపడుతూ కాలుకు పుండు కావడంతో చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు వచ్చాడు. అనుమానంతో శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా, గురువారం కరోనా పాజిటివ్‌ రావడంతో వృద్ధుడిని గాంధీలోని ఐసోలేషన్‌కు తరలించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా దవాఖానలో నలుగురు కరోనా అనుమానితులకు చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.

దుండిగల్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని రోడామిస్త్రీనగర్‌, జహంగీర్‌ బస్తీకి చెందిన ఓ వృద్ధుడు(58)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఎర్రగడ్డలోని ఆయూష్‌ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన చంద్రగిరినగర్‌ వాసికి ఇతను స్వయంగా సోదరుడు కావడం గమనార్హం.

హైదర్‌నగర్‌/కొండాపూర్‌: వెస్ట్‌జోన్‌ పరిధిలోని 14 కంటైన్మెంట్‌ జోన్లలో  గురువారం సుమారు 4 జోన్లలోని ప్రజలు సిబ్బందితో చికెన్‌ సైతం తెప్పించుకోవడం గమనార్హం. తమకు అరకిలో, కిలో చికెన్‌ కావాలంటూ ఫోన్లలో సిబ్బందికి ఆర్డర్‌ వేయడం.. సిబ్బంది ఓపికగా వారికి తెచ్చిస్తుండటం విశేషం.  ప్రధానంగా వెస్ట్‌జోన్‌ పరిధిలోని 14 కంటైన్‌మెంట్‌ జోన్లలో కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పర్యటించారు.  

ఖైరతాబాద్‌: గాంధీనగర్‌కు చెందిన  (64) వృద్ధురాలు రెండు రోజుల క్రితం తీవ్ర గాల్‌బ్లాడర్‌ సమస్యతో ఓ ప్రైవేట్‌  ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చేరింది.  వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు బుధవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం ఆమె రక్తనమూనాలను గాంధీకి తరలించారు. గురువారం సదరు మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో పోలీసులు వైద్యశాలకు చేరుకొని ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. అలాగే ఆపరేషన్‌ ప్రక్రియలో సంబంధం ఉన్న వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని హోం క్వారంటైన్‌లో పెట్టారు.


logo