శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 24, 2020 , 00:29:42

ఫీజులు పెంచం

ఫీజులు పెంచం

  • వచ్చే ఏడాదికి చెల్లించినవి కూడా తిరిగి ఇచ్చేస్తాం
  • ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాం
  • పాఠశాలల యాజమాన్యాల సంక్షిప్త సందేశాలు

డియర్‌ పేరెంట్స్‌.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గతేడాది ఫీజులే ఈ ఏడాది కూడా అమల్లో ఉంటాయి. ఇది వరకే అధిక ఫీజులు చెల్లించి ఉంటే తిరిగి ఇచ్చేస్తాం. ఇది జూబ్లీహిల్స్‌లోని ఓ పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం పంపిన ఎస్‌ఎంఎస్‌ సందేశం.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2020-21 విద్యాసంవత్సరానికి ఫీజుల పెంపును ఉపసంహరించుకుంటున్నాం. పాత ఫీజులే కొనసాగుతాయి. ఇది మరో పాఠశాల తల్లిదండ్రులకు పంపిన సందేశం.గ్రేటర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఒక విద్యార్థికి చెల్లించిన ఫీజుల తీరిది. ఈ సంవత్సరం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫీజు చెల్లించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ పాఠశాలలో చదివే తల్లిదండ్రులకు రూ. 18,800 ఫీజు భారం తప్పనుంది. ఈ ఒక్క పాఠశాలలోనే కాదు. గ్రేటర్‌లోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఫీజుల భారం తప్పనుంది.  ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్‌-46 ప్రభావం. ఈ జీవోను గ్రేటర్‌లోని ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లు తూచా తప్పకుండా పాటిస్తామంటున్నాయి. ఒక్క రూపాయి పెంచం.. ఎక్కువ తీసుకుంటే తిరిగి ఇచ్చేస్తామంటున్నాయి. ఇలా తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌లలో సందేశాలు పంపిస్తున్నాయి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూల్స్‌ సైతం తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను అమలుచేసి తీరుతామంటున్నాయి.

ట్యూషన్‌ ఫీజుయే..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫీజులు పెంచరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే మంగళవారం జీవో జారీ కావడంతో ఫీజుల భారం తప్పనుంది. దీనితో కొత్తగా ఫీజులు పెంచడానికి ఆస్కారంలేకపోగా, కేవలం ట్యూషన్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఒక ఫీజులను ఏక మొత్తంగా కాకుండా.. నెలనెలా వసూలు చేసుకోవాలి. విద్యాశాఖ నుంచి గుర్తింపు పొందిన సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలు, కళాశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే ఆయా విద్యాసంస్థల గుర్తింపును సైతం రద్దు చేస్తారు.

  • ఇక ట్యూషన్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాలి. డొనేషన్లు, క్యాపిటేషన్‌ ఫీజులు, టర్మ్‌ఫీజుల పేరుతో బాదడం చేయరాదు. 

పెంపునకు కళ్లెం.. 

గ్రేటర్‌లో 6 వేలకు పైచిలుకు ప్రైవేట్‌ విద్యాసంస్థలున్నాయి. వీటిల్లో 15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నాణ్యమైన విద్యకోసం వీటిల్లో చేరుతున్నవారికి యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజులు కలవరపెడుతున్నాయి. ఏడాదికి 15 శాతం చొప్పున ఫీజులను పెంచేసుకుంటున్నాయి. ఒక్కోసారి ఇది 25 శాతంగా ఉంటుందంటే అతిశయోక్తికాదేమో. తల్లిదండ్రులను సంప్రదించకుండానే.. వారి ఆర్థిక స్థితిగతులను లెక్కలోకి తీసుకోకుండానే ఫీజులను పెంచేస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఓ స్కూళ్లో 2009 -10 విద్యా సంవత్సరానికి రూ. 76. వేలుగా ఉన్న ఫీజు 2015 -16 విద్యా సంవత్సరానికి ఏకంగా 1.73 లక్షలకు 2019 - 20కు వచ్చేసరికి రూ. 2లక్షలకు చేరింది. ఇంతగా ఫీజులు పెరుగడం మన హైదరాబాద్‌లో తప్ప మరెక్కడా కనీవినిఎరుగం. ఈ పెంపు ఒక్క పాఠశాలలకే పరిమితం కాలేదు. ఇంటర్మీడియెట్‌ కాలేజీలకు పాకింది. గతేడాది ఓ రెసిడెన్షియల్‌ కళాశాల 2.3లక్షలను ఫీజుగా వసూలు చేసిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఫిర్యాదు చేయవచ్చు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు పెంచరాదు. ఫీజులు పెంచినట్లుగా నిరూపితమైతే శాఖాపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అన్ని రకాల స్కూళ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. యాజమాన్యాలు ఫీజులు పెంచితే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు.

- వెంకటనర్సమ్మ, డీఈవో

శుభ పరిణామం

తెలంగాణ సర్కారు కఠిన నిర్ణయం తీసుకుని అమలుచేయడం మంచి పరిణామం. లాక్‌డౌన్‌తో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేదలు, రోజువారి కూలీలు అవస్థలు పడుతున్నారు. వీరందరికి ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం తప్పనుంది. సీబీఎస్‌ఈ సహా అన్ని పాఠశాలలు సర్కారు నిర్ణయాన్ని అమలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. చాలా మంది తల్లిదండ్రులకు శుభవార్తను మాతో పంచుకుంటున్నారు.

 - సీమా అగర్వాల్‌ (హెచ్‌ఎస్‌పీఏ)logo