బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 23, 2020 , 01:10:58

నగరంలో మరో 10 కేసులు

నగరంలో మరో 10 కేసులు

సిటీబ్యూరో:గ్రేటర్‌ పరిధిలోని నగర శివారు ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రంగారెడి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అటు ప్రజలు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హైదరాబాద్‌ నగరంలో మాత్రం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ నమోదు పరంపర కొనసాగుతున్నది.తాజాగా మరో 10కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 6కేసులు పాతబస్తీకి చెందినవి కాగా మిగిలిన నాలుగు కేసులు నగరంలోని ఆయా ప్రాంతాల్లో నమోదయ్యాయి. 

 • ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో బుధవారం 181మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.శశికళ వెల్లడించారు. గాంధీలో 16 మందికి పరీక్షలు జరిపినట్లు నోడల్‌ అధికారి డా.ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.
 • మలక్‌పేట జోన్‌ బృందం: పాత మలక్‌పేట డివిజన్‌ ఫకీర్‌ గల్లీలోని ఇదార్‌ ఏ మిలియా మసీదులో మర్కజ్‌కు వెళ్లి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న 30 మందికి వైద్యపరీక్షల్లో మూడు సార్లూ నెగెటివ్‌ రావడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో  వారి నివాసాలకు తరలించారు.
 • మణికొండ: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని  మెడికల్‌ దుకాణాల్లో జలుబు, జ్వరం, దగ్గుకు సంబంధించి మందులను కొనుగోలు చేసిన 19 మంది వ్యక్తుల శాంపిల్స్‌ను  గాంధీ వైద్య బృందం సేకరించినట్లు నార్సింగి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగానే క్షేత్రస్థాయిలో పరీక్షలు చేపడుతున్నామన్నారు. 
 • సికింద్రాబాద్‌: వారాసిగూడలోని  మహ్మద్‌గూడలో ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన వృద్ధుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే అతడి బంధువులతో పాటు మొత్తం 21 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా,  కుటుంబసభ్యులు నలుగురికి  వైరస్‌ సోకినట్లు తేలింది. మిగతా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, సికింద్రాబాద్‌ సర్కిల్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ కె. రవికుమార్‌ ఆధ్వర్యంలో వివిధ శాఖల నోడల్‌ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. తక్షణం మహ్మద్‌గూడలో కంటైన్మెంట్‌ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, నార్త్‌జోన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ రంగయ్య, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐలు రాజశేఖర్‌, వరుణ్‌కాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 • బోడుప్పల్‌: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధి 28వ డివిజన్‌లోని పెంటారెడ్డి కాలనీని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌ తదితరులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యాపారి కాంటాక్ట్‌లో ఉన్న 21 మంది రక్త నమూనాలను సేకరించినట్లు  అధికారులు తెలిపారు. 
 • కేపీహెచ్‌బీ కాలనీ : కేపీహెచ్‌బీ కాలనీలో ఇటీవల ఓ యువకుడికి వైరస్‌ సోకింది. దీంతో అతనితో కలిసి ఉన్న స్నేహితులను క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని జోనల్‌ కమిషనర్‌ మమత తెలిపారు. 
 • దుండిగల్‌: గాజులరామారం సర్కిల్‌, చింతల్‌ డివిజన్‌ పరిధిలోని జాహంగీర్‌బస్తీని నియంత్రిత ప్రాంతంగా అధికారులు ప్రకటించారు. ఇదే ప్రాంతానికి చెందిన  వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. 27 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. వైద్యపరీక్షల కోసం వారి రక్త నమూనాలు పంపించారు. అదే సమయంలో బస్తీ చుట్టూ  ఉన్న దారులను మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేసి  పహారా కాస్తున్నారు. 
 • హఫీజ్‌పేట్‌: క్వారంటైన్‌ పూర్త్తికావడంతో హఫీజ్‌పేట్‌ డివిజన్‌ అంబేద్కర్‌నగర్‌కు చెందిన 23 మందిని   వైద్య పరీక్షల కోసం కొండాపూర్‌ ఏరియా వైద్యశాలకు తరలించారు.
 • హిమాయత్‌నగర్‌: హిమాయత్‌నగర్‌ వైజంక్షన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉండే ఓ వృద్ధుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి కరోనాటీమ్‌కు సమాచారం అందించారు. పరీక్షల నిమిత్తం  అంబులెన్స్‌లో కింగ్‌కోఠి దవాఖానకు తరలించారు.
 • శామీర్‌పేట:  శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన బాలిక ఏప్రిల్‌ 19న అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చేరింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.  దవాఖానలో మృతి చెందడంతో ఆమె మృతదేహానికి కరోనా వ్యాధిగ్రస్తుల తరహాలోనే అంత్యక్రియలు నిర్వహించామని అధికారులు తెలిపారు. 
 • కొండాపూర్‌: కరోనా వైరస్‌ పరీక్షల ఫలితాలను వీలైనంత త్వరగా నిర్ధారించేందుకు  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో టెస్టింగ్‌ సెంటర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన 15 మంది నిపుణులను ప్రత్యేక శిక్షణ కోసం సీసీఎంబీకి పంపినట్లు వర్సిటీ పీఆర్వో ఆశిష్‌ తెలిపారు.


logo