గురువారం 28 మే 2020
Hyderabad - Apr 23, 2020 , 01:01:57

రెప్ప వాల్చకుండా కాపలా

రెప్ప వాల్చకుండా కాపలా

  • రేయింబవళ్లు సెక్యూరిటీ గార్డుల విధులు 
  • సమయానికి వెళ్లకపోతే జీతంలో కోతే
  • కడుపునిండా భోజనం కూడా చేయలేని పరిస్థితి
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర సేవగా గుర్తించాలని వినతి 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ వేళ తమ బాధలు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు సెక్యూరిటీ గార్డులు. తమవి కూడా తప్పనిసరి విధులు కావడంతో అత్యవసర సేవల కింద గుర్తించాలని కోరుతున్నారు. నగరంలో సుమారు లక్ష మంది వరకు సెక్యూరిటీ గార్డులు షాపింగ్‌మాల్స్‌, గోదాంలలో పనిచేస్తున్నారు. ఎండనక, వాననక వాటికి రక్షణ కల్పిస్తున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. చాలా మంది శివారులో తక్కువ అద్దెకు ఇండ్లు తీసుకొని ఉంటున్నారు. ప్రస్తుత స్థితిలో అక్కడి నుంచి రాకపోకలు కష్టంగా మారాయి. కంటైన్మెంట్‌ జోన్లు దాటుకొని రావాలంటే కష్ట్టాలు తప్పడం లేదు.  సమయానికి చేరుకోకపోతే యజమానితో మాటొస్తదని,  జీతాల్లో కోత కూడా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. సమయానికి భోజనం కూడా చేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 పనిచేస్తేనే ఇల్లు గడిచేది..

నేను పని చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది. నా భర్త ప్రైవేట్‌ ఉద్యోగి. లాక్‌డౌన్‌తో అతను ఇంట్లోనే ఉంటున్నాడు. మా ఇంటి సమీపంలో కంటైన్మెంట్‌ జోన్‌ ఉన్నది. దీంతో పరిసర ప్రాంతాల నుంచి బయటికి రానివ్వడం లేదు. డ్యూటీకి ఆలస్యంగా వస్తే  జీతంలో కోత ఉంటుంది.  గంట ఆలస్యమైనా ఆ రోజు హాజరు పోయినట్టే. కష్టాలు పడుతూనే విధులకు హాజరవుతున్నా.

- సబిత, సెక్యూరిటీ గార్డు

నాలుగేండ్ల బాబును వదిలి..

నాకు నాలుగేండ్ల బాబు ఉన్నాడు. బాబుకు అన్నం పెట్టాలంటే నేను గార్డు ఉద్యోగం చేయాల్సిందే. డిగ్రీ పూర్తి చేసిన నేను కొన్నేండ్లుగా సూ పర్‌ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నా. అందరినీ తనిఖీ చేస్తా. కరోనా నేపథ్యంలో వారికి శానిటైజర్‌ ఇస్తా. శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తా. నేను కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తా. ఈ ఉద్యోగం బతకాడానికి ఆసరాగా ఉన్నా మా సేవలను ఎవరూ సరిగా గుర్తించరు.

- అనురాధ, సెక్యూరిటీ గార్డు

భద్రత కల్పిస్తున్నా...

ఎన్ని కష్టాలు ఎదురైనా మేం డ్యూటీకి వెళ్లాల్సిందే. మాకు అప్పగించిన బాధ్యతను నిర్వహించాల్సిందే. శివారు ప్రాంతంలో డ్యూటీ పడితే నరకమే. సైకిళ్ల పై వెళ్లాల్సిందే.  లాక్‌డౌన్‌తో బస్సులు, ఆటోలు లేకపోవడంతో నడుచుకుంటూ అయినా సమయానికి చేరుకుంటున్నాం. నిబద్ధతతో మేము విధులు నిర్వహించే ప్రాంతాల్లో భద్రత కల్పిస్తున్నా.. ఎవరూ ప్రేమగా చూడరు.

రవిచంద్ర, సెక్యూరిటీ గార్డు ఆఫీసర్‌, తార్నాక

సాధారణ రోజుల మాదిరిగానే..

భద్రతకు సంబంధించిన అంశాల్లో మా గార్డులు సమర్థవంతంగా పనిచేస్తారు. మా గార్డులు ఉన్నచోట దొంగతనాలు, దోపిడీలు అసలు జరగవు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా సాధారణ రోజుల మాదిరిగానే మా గార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు.

- గిరిధర్‌, రిలాయబుల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు

నిరంతరం పర్యవేక్షిస్తాం..

అన్నీ మూసి ఉన్నాయని నిర్లక్ష్యం చేయం. మాకు అప్పగించిన డ్యూటీలో అవి బంద్‌ ఉన్నా నిరంతరం పర్యవేక్షిస్తాం. కోట్ల విలువచేసే సామగ్రి ఉండే దుకాణాలు, గోదాంలు, ఇతర వాణిజ్య కార్యాలయాలకు సెక్యూరిటీగా ఉంటున్నాం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ మాకు చాలా కష్టాలు తెచ్చి పెట్టింది. అయినా తట్టుకొని ఉద్యోగం చేస్తున్నాం. క్రమం తప్పకుండా డ్యూటీలు చేస్తున్నా లాక్‌డౌన్‌ నెపంతో మాకు జీతాలు వస్తాయో లేదో అనే ఆందోళన ఉన్నది.

- వెంకట్‌రెడ్డి, సెక్యూరిటీ గార్డు, సికింద్రాబాద్‌


logo