శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 23:36:51

సేవలకు.. వాట్సాప్‌

సేవలకు.. వాట్సాప్‌

కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఈ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండేందుకు స్థానికంగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసింది. ఈ గ్రూపుల ద్వారానే సేవలందిస్తున్నారు. వారి అవసరాలను బట్టి ఇంటింటికీ వెళ్లి సమస్యలు తీర్చుతున్నారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వికలాంగులు, వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసి నిరంతర సేవలందిస్తున్నారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి కంటైన్‌మెంట్‌ ఏరియాకు పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటూ... ఎలాంటి సమస్యలు రాకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, బహుళ అంతస్తుల భవనాలు, అపార్టుమెంట్లు, బస్తీలు, కాలనీల్లో చురుగ్గా ఉండే యువకులు, పెద్ద మనుషులతో వాలంటీర్లను తయారు చేశారు. అధికార యంత్రాంగంతో పాటు వారందరినీ కలుపుకొని ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌లో స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉన్నారు. దీనికి జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలతో పాటు వాలంటీర్లు, ఆ కాలనీ, బస్తీ పెద్దలు, చురుకైన వారిని అడ్మిన్లుగా చేశారు. ఏదైనా సమస్య వస్తే అందులో పోస్టు చేయాలి. వెంటనే నిత్యావసరాలకు సంబంధించినవి అయితే జీహెచ్‌ఎంసీ సిబ్బంది తెచ్చి ఇస్తారు. వాటర్‌, విద్యుత్‌ సమస్యలు అయితే.. సంబంధిత శాఖ సిబ్బంది వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసర వస్తువులు కావాల్సిన వారు అందులో పోస్టు చేయాలనే నిబంధన పెట్టారు. వికలాంగులు, వయోవృద్ధుల కష్టాలనూ తీర్చేందుకు ప్రభుత్వం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది 

ఇలా పరిష్కరించారు

 ఒక ఇంట్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వాట్సాప్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో విద్యుత్‌ సిబ్బంది వెళ్లి సమస్యను పరిష్కరించారు. డబీర్‌పురా ప్రాంతానికి చెందిన మహిళ.. ఆరోగ్యం బాగాలేదని, దవాఖానకు వెళ్లాలని కోరింది. ఈ విషయాన్ని పోలీసులు.. ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడి ఆమెను దవాఖానకు పంపించారు.

కేర్‌ గివియర్‌ పాస్‌లు..

వయోవృద్ధుల ఆలనాపాలన చూసుకునేందుకు గాను కేర్‌ గివియర్ల (సంరక్షకుల)ను నియమించుకోవచ్చు. పాలు, మందులు, నిత్యావసర సరుకులను తీసుకొచ్చి అందజేయడం ఈ కేర్‌ గివియర్ల బాధ్యత. ఇలా ఇప్పటి వరకు 100కు పైగా పాస్‌లు ఇప్పించి వయోవృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పోలీసు అధికారిణి సుమతి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఫుడ్‌ నీడ్స్‌ గ్రూపు, తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూపుల ద్వారా అన్ని వయోవృద్ధుల హోమ్స్‌కు అవసరయ్యే సామగ్రిని అందజేస్తున్నారు.

ఎప్పటికప్పుడూ.. అలర్ట్‌గా ఉంటాం...

ప్రజల అవసరాలు తీర్చడం కోసం వాట్సాప్‌ గ్రూప్‌ను మెహిదీపట్నం కంటైన్‌మెంట్‌ - 70లో ప్రారంభించాం. మేం స్థానికంగా పనులు  చేస్తుండడంతో అందరితో పరిచయాలు ఉన్నాయి. దీంతో చురుకైన వారిని గ్రూప్‌లో చేర్చుకొని.. నిరంతరం ఆ ప్రాంతంలో ఉండే వారికి సేవలు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అక్కడ ఏమి జరుగుతుందనే విషయాన్ని చెబుతున్నాం. చాలా వరకు తమకు స్థానిక ప్రజలు సహకరిస్తున్నారు. 

-  రవి, జీహెచ్‌ఎంసీ ఏఈ, మెహిదీపట్నం

24 గంటలు పటిష్ట చర్యలు...

డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాలుగు కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. సెక్టార్‌ ఎస్సైలు ఆయా కంటైన్‌మెంట్‌ బందోబస్తు ఇన్‌చార్జీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎవరికి ఏమీ కావాలన్నా వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తే.. అది ఇంటి వద్దకు చేర్చుతున్నాం. దీనికి ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ సిబ్బందిని కేటాయించింది. మెడికల్‌కు సంబంధించిన అత్యవసరమైతేనే బయటకు పంపిస్తున్నాం. ప్రజలు బయటకు రాకుండా 24 గంటలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.

- సత్యనారాయణ, డబీర్‌పురా ఇన్‌స్పెక్టర్‌

 హెల్ప్‌లైన్‌ ద్వారా..

చాంద్రాయణగుట్టకు చెందిన అమ్జద్‌కు మందుల కోసం హెల్ప్‌లైన్‌ను సంప్రదించాడు. స్వయంగా వికలాంగులు, వయోవృద్ధులశాఖ ఏడీ పుష్పలత మెడికల్‌ షాపునకు తీసుకెళ్లి మందులు ఇప్పించారు. 

కర్మన్‌ఘాట్‌లో ఉండే ఓ వృద్ధుడికి డయాలసిస్‌ చేయనిదే కుదరదు. తీసుకెళ్లేందుకు ఎవరూ లేకపోవడంతో వృద్ధుల హెల్ప్‌లైన్‌ను సంప్రదించగా వెంటనే వచ్చి తీసుకెళ్లి డయాలసిస్‌ చేయించి.. మరలా ఇంటి వద్ద దించి వెళ్లారు.

 కష్టమొస్తే.. కాల్‌ చేయండి

వలస జీవులకు హెల్ప్‌లైన్‌ 

 • హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ -040 23202813
 • రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ -040-23230811/23230813/23230817, 18004250817
 • మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ -94924 09781
 • జీహెచ్‌ఎంసీ సేవలకు కాల్‌సెంటర్‌ 040-21111111, 91524686557, 9154686558, 9154 686549
 • అత్యవసర వేళహైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మొబైల్‌, వాట్సాప్‌ : 9490 616 780
 • ల్యాండ్‌లైన్‌ : 040-23434343
 • సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌  
 • -మొబైల్‌, వాట్సాప్‌  9490 617 440
 • ల్యాండ్‌లైన్‌ :  9490617100
 • రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌  
 • మొబైల్‌, వాట్సాప్‌ 9490617234
 • ల్యాండ్‌లైన్‌ :  040-27853558
 • ఉచిత క్యాబ్‌ సేవల కోసం - 8433958158
 • ఆరోగ్య సేవలకు -040-48214595
 • ఉచిత వైద్య సేవలకు- 93912 78808, 97043 76352, 040- 2713 3393


logo