సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 23:33:27

బండికి తాళమే

బండికి తాళమే

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా.. కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నా.. వాటిని సాకుగా చూపిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ప్రతి రోజు వాహనాలు సీజ్‌ చేస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.  ఈ విషయాన్ని  హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టి .. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేశారు. పాసులను దుర్వినియోగం చేస్తున్న వాహనాలను కూడా సీజ్‌ చేశారు.లాక్‌డౌన్‌  ఉల్లంఘనదారులపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించడంతో మూడు కమిషనరేట్ల బాస్‌లు అప్రమత్తమయ్యారు. మంగళవారం పలు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. అనవసరంగా రోడ్లెక్కిన వాహనాలను ఎక్కడికక్కడ సీజ్‌ చేయాలని ఆదేశించడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనంపై నిఘా పెట్టారు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదుచేసి.. సీజ్‌ చేశారు. కొన్ని చోట్ల పాసులున్నా.. మీడియా ప్రతినిధులైనా.. ఎవరినీ కూడా వదలకుండా చెక్‌పోస్టుల వద్ద నిలిపివేశారు. తమకు ఉన్నతాధికారులు చెబితేనే వదులుతామంటూ క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది పేర్కొన్నారు.   పాసులు దుర్వినియోగం చేసిన వాహనాలను అక్కడికక్కడే సీజ్‌ చేశారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలతో అక్కడక్కడ ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తుండడంతోనే రద్దీ ఏర్పడిందంటూ అధికారులు పేర్కొన్నారు.  

వాహనాలు సీజ్‌..

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మంగళవారం నిబంధనలు పాటించని సుమారు 5,000 వాహనాలను సీజ్‌ చేశారు. ఇందులో ట్రాఫిక్‌ పోలీసులు 3,700 వాహనాలను సీజ్‌ చేయగా, లాక్‌డౌన్‌ ఉల్లంఘనలను అతిక్రమించిన 5,007 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన 15,315 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్‌ పరిధిలో 800 కేసులు నమోదు చేసి.. దాదాపు 1,000 వాహనాలను సీజ్‌ చేశారు. 14,553 ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఈ చలాన్‌లను జారీ చేశారు. రాచకొండ పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు 500 వాహనాలు సీజ్‌, 300 కేసులు నమోదు చేశారు.  ఇదిలాఉండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కిరాణా దుకాణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలను మూసివేశారంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై సీపీలు స్పందిస్తూ అవన్నీ పుకార్లని, నిత్యావసరాలు అందించే దుకాణాల విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, అవి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. 


logo