మంగళవారం 02 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 23:30:24

కఠిన చర్యలు తప్పవు

కఠిన చర్యలు తప్పవు

చార్మినార్‌ : కరోనా కట్టడి... లాక్‌డౌన్‌ సందర్భంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మంగళవారం పాతబస్తీలోని మదీనా క్రాస్‌రోడ్డుతో పాటు పంచమహల్లా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో కలిసి సీపీ పర్యటించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు అత్యావసరాల నిమిత్తం మంజూరు చేసిన పాసులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గతంలో జారీ చేసిన పాసులను రద్దు చేసి, 400 వాహనాలను సీజ్‌ చేశామని తెలిపారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినం : మహేశ్‌ భగవత్‌

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో రెండో దశ లాక్‌డౌన్‌ నిబంధనలను ఇక కఠినంగా అమలు చేస్తున్నామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ మహేశ్‌ భగవత్‌ హెచ్చరించారు. స్థానిక నివాసం నుంచి మూడు కిలోమీటర్లు దాటితే.. వారి వాహనం సీజ్‌ చేస్తామని, బయటకు వచ్చేవారు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలన్నారు. పోలీసుల కోసం ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 20 వేలకు పైగా వలసకార్మికులు, అనాథలు, పేదవారికి భోజనాన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి రోజు పంపిణీ చేస్తున్నామన్నారు. కాగా..  బోడుప్పల్‌లో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో మంగళవారం స్థానిక మేయర్‌ సామల బుచ్చిరెడ్డితో కలిసి సీపీ మహేశ్‌ భగవత్‌ పర్యటించి వివరాలు తెలుసుకున్నారు.


logo