శనివారం 30 మే 2020
Hyderabad - Apr 21, 2020 , 00:30:51

సైబర్‌ నేరగాళ్ల మోసం..

సైబర్‌ నేరగాళ్ల మోసం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  లాక్‌డౌన్‌లో కూడా సైబర్‌ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నగరానికి చెందిన ఇద్దరికి టోకరా వేయగా.. మరో మహిళను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశారు. దీంతో బాధితులు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసులు దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫేస్‌బుక్‌లో మహిళగా చెప్పుకున్న సైబర్‌నేరగాడు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తనకు ఆర్థిక సాయం కావాలని సదరు మహిళ కోరగా..అతను రూ.90 వేలను ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. ఇంకా కావాలని అడుగుతుండగా.. ఇదంతా మోసమని గుర్తించి బాధితుడు సోమవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

నగరానికి చెందిన 60 ఏండ్ల మహిళను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌చేశారు. మీరు ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు చూశారు.. మా వద్ద సాక్ష్యాలున్నాయి.. వెంటనే వెయ్యి డాలర్లు బిట్‌కాయిన్‌లో చెల్లించాలి.. లేకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు  సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరానికి చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌ పోర్టల్‌ బిగ్‌ బాస్కెట్‌లో సరుకులకు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే సరుకులు ఎంతకీ రాకపోవడంతో గూగుల్‌లో కనపడిన కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేయగా.. బిగ్‌ బాస్కెట్‌ ప్రతినిధులమంటూ సైబర్‌ నేరగాళ్లు మాట్లాడారు. సరుకులు మరుసటి రోజు పంపిస్తాం.. ఇందుకు రూ.10 లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తున్నాం.. పైన రూ.10 అని పెట్టి.. కింద రూ.52వేలు అని రాశారు. దీన్ని గమనించిన ఆమె కోడ్‌ను స్కాన్‌ చేయగా.. రూ. 52 వేలు ఖాతాలో నుంచి బదిలీ అయ్యాయి. దీంతో మోసపోయానని గమనించి బాధితురాలు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


logo