శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 00:30:30

తగ్గిన పాజిటివ్‌ కేసులు

తగ్గిన పాజిటివ్‌ కేసులు

  • 9 నెలల చిన్నారికి పాజిటివ్‌
  • గుండెపోటుతో మృతిచెందిన వృద్ధుడికీ.. 

సికింద్రాబాద్‌, నమస్తేతెలంగాణ : మెట్టుగూడలో  9 నెలల చిన్నారికి కరోనా సోకింది. నాలుగు రోజుల కిందట పాజిటివ్‌ వచ్చిన నర్సు నివాసం పైనే చిన్నారి తల్లితండ్రులు ఉంటారు. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న చిన్నారితో పాటు బాబు తల్లిని కూడా గాంధీ దవాఖానకు తరలించారు.   

మరో ముగ్గురికి...

మల్కాజిగిరి/నేరేడ్‌మెట్‌/దుండిగల్‌ :  నేరేడ్‌మెట్‌ డివిజన్‌ శ్రీకాలనీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 3 రోజుల కిందట పాజిటివ్‌గా తేలిన వృద్ధుడి భార్య(70), మనుమరాలు(23)కు సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిం ది. గాజులరామారం పరిధిలోని రోడామిస్త్రీనగర్‌కు చెందిన 65 ఏండ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. అతడిని ఈ నెల 18న గాంధీకి తరలించగా సోమవారం పాజిటివ్‌గా తేలింది.

గుండెపోటుతో మృతిచెందిన వృద్ధుడికి పాజిటివ్‌

సికింద్రాబాద్‌ : గుండెపోటుతో మృతిచెందిన వృద్ధుడికి (72)  కరోనా పాజిటివ్‌గా తేలింది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారాసిగూడకు చెందిన వృద్ధుడికి ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్‌ దవాఖానకు తీసుకువెళ్లారు. తర్వాత గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యులు రక్తనమూనాలు సేకరించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. సోమవారం  వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది.పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను గాంధీ దవాఖానకు తరలించారు.

ఆరుగురు క్వారంటైన్‌కు..

బడంగ్‌పేట/చార్మినార్‌ :  బాలాపూర్‌కు చెందిన వ్యక్తి  చెత్తను రిక్షాలో వేసుకొని తరలిస్తుంటాడు. ఇటీవల పాజిటివ్‌గా తేలిన ఓ యువకుడి వద్ద రిక్షా కార్మికుడు నీళ్ల బాటిల్‌ తీసుకొని తాగడంతో ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు వచ్చి ఉంటాయని వైద్యాధికారులు భావిస్తున్నారు. కార్మికుడితో పాటు అతడి భార్య, అత్తనూ రావిర్యాలలోని క్వారంటైన్‌కు తరలించారు. రాయల్‌ కాలనీకి చెందిన మరో మహిళ, ఇటీవల అనంతపురం నుంచి వచ్చిన మరో వ్యక్తిని కూడా క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పార్వతీనగర్‌ పరిధిలోని ఓ పారిశుధ్య కార్మికురాలు వారం రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ ఇంటివద్దనే ఉంటున్నది.సోమవారంవైద్యులు ఆమెను చార్మినార్‌ సమీపంలోని యునానీ దవాఖానకు తరలించారు.

ఆ కుటుంబంలో ఐదుగురికి నెగెటివ్‌

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌లోని ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో ఇటీవల మరణించిన వృద్ధురాలి బంధువుల్లో ఐదుగురికి  కరోనా  నెగెటివ్‌గా తేలింది.

బల్దియా కమిషనర్‌ పర్యటన... 

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ నియోజకవర్గంతో పాటు  కూకట్‌పల్లి సర్కిల్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ హస్మత్‌పేటలోని నియంత్రిత ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పరిశీలించారు.  జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ కె. రవికుమార్‌ ఆయన వెంట ఉన్నారు.

మేడ్చల్‌ కలెక్టర్‌...

మేడ్చల్‌ కలెక్టరేట్‌/ కీసర/శామీర్‌పేట : శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లి, కీసర మండలం చీర్యాల, జీహెచ్‌ఎంసీ పరిధి అల్వాల్‌లోని నియంత్రిత ప్రాంతాలను సోమవారం మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు.

రాచకొండ సీపీ పర్యటన

నేరేడ్‌మెట్‌ శ్రీకాలనీ నియంత్రిత ప్రాంతాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, మల్కాజిగిరి డీసీపీ రక్షితాకృష్ణమూర్తి పరిశీలించారు. వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా పీపీఈ కిట్‌లను సీపీ అందజేశారు. అలాగే రాజేంద్రనగర్‌ పరిధిలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.

నియంత్రిత ప్రాంతాల్లో పర్యటన..

కేపీహెచ్‌బీ కాలనీ/మెహిదీపట్నం  కాలనీలో నియంత్రిత ప్రాంతాన్ని జోనల్‌ కమిషనర్‌ వి.మమత, డీసీ ప్రశాంతి, ఏఎంహెచ్‌వో సంపత్‌కుమార్‌, బాలానగర్‌ వైద్యాధికారి చందర్‌ తదితరులు పరిశీలించారు. కూకట్‌పల్లి రైతు బజార్‌ను తాత్కాలికంగా మూసివేశారు. టోలిచౌకి గ్రామర్‌ కాలనీలో జీహెచ్‌ఎంసీ -13 డిప్యూటీ కమిషనర్‌ సువార్త, ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ శీనయ్య పర్యటించారు.

గ్రేటర్‌లో 12 కేసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా కేసుల్లో సోమవారం స్వల్ప తగ్గుదల కనిపించింది. మొత్తం 12 కేసులు నమోదవగా అందులో హైదరాబాద్‌ నగరంలోనే 10 ఉన్నాయి. గడిచిన రెండు రోజుల కేసులను పరిశీలిస్తే గ్రేటర్‌ వ్యాప్తంగా 6కేసులు, నగరంలో 5కేసుల చొప్పున తగ్గుదల కనిపించింది. తాజాగా కేసుల్లో 6 పాతబస్తీలో, నాలుగు నగరంలోని ఇతర ప్రాంతాల్లో, మరో 2 ఎల్‌.బీ.నగర్‌, సరూర్‌నగర్‌లో నమోదైనట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా సోమవారం గాంధీ మెడికల్‌ కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌లో 136 మంది, ఉస్మానియాలో 100 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.


logo