బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 00:26:40

మరింత కఠినంగా లాక్‌డౌన్‌

మరింత కఠినంగా లాక్‌డౌన్‌

  • స్పెషల్‌ డ్రైవ్‌తో తనిఖీలు ముమ్మరం
  • సిటీలో 395 పాజిటివ్‌ కేసులు..
  • సీపీ అంజనీకుమార్‌ వెల్లడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలవుతున్నదని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని సీపీ అంజనీకుమార్‌ సూచించారు. సోమవారం సీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాక్‌డౌన్‌కు సబంధించిన పలు విషయాలను సీపీ వివరించారు. పాసులు తీసుకున్న వారు వాటిని దుర్వినియోగం చేస్తే.. అక్కడే దాన్ని రద్దు చేసి వాహనాన్ని సీజ్‌ చేస్తామన్నారు. ఐటీ సెల్‌ ఆధ్వర్యంలో ఈ పాసులను అందుబాటులోకి తెచ్చామని.. అవసరమైనవారు హైదరాబాద్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్యూఆర్‌ కోడ్‌తో ఉండే పాసులు కావడంతో కలర్‌లో ఉన్నా, బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఎలాంటి సమస్యా ఉండదన్నారు. నగరంలో 2 వేల మంది సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారని... వారికి కావాల్సిన శానిటైజర్లు, మాస్క్‌లు, వ్యక్తిగత రక్షణ కిట్లను అందజేశామన్నారు. నగరంలో 124 కంటైన్‌మెంట్‌ జోన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయని సీపీ వివరించారు. 

ఉల్లంఘనలపై స్పెషల్‌ డ్రైవ్‌

స్పెషల్‌ డ్రైవ్‌తో తనిఖీలు ముమ్మరం చేసి ఉల్లంఘనదారులపై కఠినంగా ఉంటామన్నారు. ఇప్పటి వరకు లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై 49,853 కేసులు నమోదు కాగా 69,288 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. నగరంలో 130 చెక్‌పోస్టులున్నాయని.. వీటి సంఖ్యను పరిస్థితులను బట్టి పెంచుతామన్నారు. 

ఆర్నెళ్ల తర్వాతే  వాహనాలు: సైబరాబాద్‌ సీపీ 

 ఒక సారి బయటికి వస్తే నాలుగు రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను తీసుకెళ్లాలని.. పదే పదే బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. మొదటి దశలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు 10 వేల వాహనాలు సీజ్‌, 3 లక్షల వాహనదారులకు ట్రాఫిక్‌ ఈ చలాన్‌లు జారీ, 1200 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సారి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు ఇండ్లలోనే ఉండి కరోనా కట్టడికి సహకరించాలని సూచించారు.  

 దీని కోసం ప్రత్యేక లాక్‌డౌన్‌ బృందాలను ఏర్పాటు చేసి.. రోడ్లపై పెట్రోలింగ్‌ను పెంచుతామని తెలిపారు. సీజ్‌ అయిన వాహనం... తిరిగి మీ చేతికి చట్టపరంగా రావాలంటే కచ్చితంగా ఆరు నెలలు పడుతుందన్నారు. అన్ని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయడంతో పాటు ఎవరినీ అనుమతించబోమని  సీపీ తెలిపారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

పటిష్ట  నిఘా:  రాచకొండ  సీపీ 

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో నిఘా పటిష్టంగా ఉండాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పోలీసులను ఆదేశించారు. సోమవారం ఆయన నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరి వివరాలు అందుబాటులో ఉండాలన్నారు. ఈ ప్రదేశంలో కొనసాగుతున్న కార్యకలాపాలపై జీహెచ్‌ఎంసీ, వైద్య, రెవెన్యూ శాఖ అధికారులతో సీపీ మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఈ ప్రదేశంలో పని చేస్తున్న హెల్త్‌ వర్కర్లకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌లను అందజేశారు. కమిషనర్‌ వెంట మల్కాజిగిరి డీసీపీ రక్షిత, తదితర అధికారులు ఉన్నారు.


logo