శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 21, 2020 , 00:24:55

అద్దె తీసుకోం..

అద్దె తీసుకోం..

  • సీఎం కేసీఆర్‌ నిర్ణయం భేష్‌ 
  • కిరాయిదారులు, ఇంటి యజమానుల హర్షం  

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ అమలుతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయం కూడా లేదు. ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా అద్దె ఇండ్లలో ఉండే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కిరాయి కట్టేందుకు డబ్బులేక, ఇంటి యజమానికి సమాధానం చెప్పుకోలేక నరకయాతనను చూస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ కిరాయిదారులకు గొప్ప ఊరటనిచ్చారు. ఉపాధి కోల్పోయి జీవనం సాగించడం కష్టంగా మారడంతో వారి పరిస్థితులను అర్థం చేసుకొని  ఇళ్ల కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్‌, మే నెలల అద్దెను వసూలు చేయకూడదని ఆదేశించారు. తర్వాత దానిని వాయిదాల పద్ధతిలో వడ్డీ లేకుండా తీసుకోవాలని సూచించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కిరాయిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పెద్ద మనసుతో అర్థం చేసుకుని అండగా నిలబడ్డారని కొనియాడారు. అద్దె కోసం సతాయిస్తే ఇంటి యజమానులపై కఠినంగా చర్యలుంటాయని, ఎవరైనా కిరాయి కోసం ఇబ్బంది పెడితే 100కి డయల్‌ చేసి చెప్పాలని సూచించడం ప్రభుత్వం పట్ల మరింత నమ్మకం పెరిగిందంటూ కిరాయిదారులు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం పట్ల ఇంటి యజమానులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలూ కిరాయి అడుగను

కరోనా వైరస్‌  మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అన్ని వర్గాలు తీవ్ర ప్రభావానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.  నేనూ ఓ ప్రైవేట్‌ ఉద్యోగినే. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ సార్‌  చెప్పినట్లు మా ఇంట్లో కిరాయికి ఉండే వారిని మూడు నెలల వరకూ అద్దెను అడుగను. సీఎం సారు చెప్పినట్లు వాయిదాల పద్ధతితో తీసుకుంటాను. ప్రభుత్వ ఆదాయం కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్న సీఎం సార్‌ మాట ఎంత భరోసానిచ్చిందో మాటల్లో చెప్పలేను.

-వాసిరెడ్డి సతీశ్‌ చౌదరి, ఇంటి యజమాని, హైదర్‌నగర్‌

మానవత్వంతో వ్యవహరిద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఎవరి పరిధిలో వారు తమ వంతు చేయూతనందించాలి. ఇంటి అద్దెల సమస్య సామాన్యుడి గుండెను బరువెక్కిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఇంటి యజమానులను ఉద్దేశిస్తూ చేసిన సూచనను మానవత్వంతో ప్రతి ఇంటి యజమాని పాటించాలి. కిరాయిదారులకు అన్ని విధాలా మనోధైర్యాన్ని పెంపొందించాలి.  నా ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఇబ్బందులు పెట్టకూడదన్న నిర్ణయానికి ఇది వరకే వచ్చాను.    

- పిట్ల మనోహర్‌ (యజమాని), సనత్‌నగర్‌. 

ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తాం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి అద్దెలకోసం ఇబ్బంది పెట్టవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన వెంటనే నిర్ణయించుకున్నాను. వారు ఇచ్చినప్పుడే తీసుకుంటాను.  మానవత్వంతో తీసుకున్న నిర్ణయం ఇది. మంచి మనసున్న నాయకుడు రాష్ర్టాన్ని పాలిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడిచి మానవత్వాన్ని చాటుకుంటాం. ఇంత మంచి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. 

- పున్‌రెడ్డి కృష్ణారెడ్డి, ఇంటి యజమాని 

అద్దె చెల్లింపులో వెసులుబాటు కల్పించాం 

ఇంటి అద్దె వసూలు విషయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని అమలు చేస్తాను. కిరాయిదారులకు చెల్లింపు విషయంలో వెసులు బాటు కల్పించాను. లాక్‌డౌన్‌తో ఇండ్లకే పరిమితమై ఎలాంటి ఆదాయం లేక ఇంటి వద్దే ఉంటున్న వారికి ప్రతి ఒక్కరూ మనోధైర్యం కల్పించాలి. లాక్‌డౌన్‌ ఎత్తేశాక వాయిదాల పద్ధతిలో కిరాయిదారులు అద్దెచెలించాలని సూచించాను. 

- కొత్తకూర్మ కలమ్మ, ఇంటి యజమాని (తుర్కయాంజాల్‌, మాజీ సర్పంచ్‌) 

అద్దెకుంటున్న వారిని ఆదుకోవాల్సిందే...

 ఆపత్కాలంలో ఇంటి యజమానులు ఉదారతను చాటుకోవాలి. చేతుల్లో డబ్బులు లేని సమయంలోమనో ధైర్యాన్ని కోల్పోకుండా, వారిలో ధైర్యాన్ని నింపి యజమానులు మానవత్వాన్ని చాటుకోవాలి. కరోనా దెబ్బకు సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు బాధితులే కావడంతో .. రాబోయే రోజులు ఎవరికైనా అత్యంత క్లిష్టమైనవే. ఈ పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కొంటూ అధిగమించాలి. సీఎం కేసీఆర్‌ నిర్ణయం సరైనదే.

   - పల్లికోన సుధాకర్‌, ఇంటియజమాని, బీకేగూడ, సనత్‌నగర్‌. 


logo