ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 20, 2020 , 00:45:56

మీ రక్షణ కోసమే..

మీ రక్షణ కోసమే..

  • లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించండి..
  • అనవసరంగా రోడ్లపైకి రాకండి...
  • అర్థం చేసుకొని సహకరించండి
  • కొందరు వాగ్వాదానికి దిగుతున్నా..  ఓపిగ్గా సమాధానం
  • మీ ప్రాణాలను కాపాడుకొని.. ఇతరుల ప్రాణాలను కాపాడండి..
  • పోలీసుల వేడుకోలు...

కరోనా కట్టడికి.. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు, అధికారులు కోరుతున్నా.. కొందరు పట్టించుకోవడంలేదు. ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. కనీసం హెల్మ్‌ట్‌లు, మాస్క్‌లు కూడా ధరించకుండా తిరుగుతున్నారు. కారులో ఇద్దరే వెళ్లాలని నిబంధన ఉన్నా పట్టించుకోవడంలేదు. చెక్‌పాయింట్ల వద్ద పోలీసులు ఆపితే.. కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అర్జెంట్‌గా వెళ్లాలి.. వెళ్లనిస్తారా? లేదా? అంటూ రుబాబుగా మాట్లాడుతున్నారు. కొందరైతే వేధిస్తున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తామని పోలీసులనే బెదిరిస్తున్నారు. అయినా పోలీసులు.. మీ రక్షణ కోసమే మేం పనిచేస్తున్నాం.. నిబంధనలను పాటించాలని వేడుకుంటున్నారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై ఎవరూ  రావద్దని వేడుకుంటున్నారు. రోడ్లపైకి వస్తే కేసుల నమోదుతోపాటు వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తున్నా... కొందరు తమకేమీ పట్టనట్లుగా వ్యవరిస్తున్నారు. అయినా పోలీసులు ఓపిగ్గా ఉంటూ.. వారిని సముదాయించి పంపిస్తున్నారు. చాలా మంది  వైద్యం, నిత్యావసర సరకులు తదితర పేర్లతో రోడ్లపైకి వస్తున్నారు. వారందరికీ సమాధానం చెబుతూ కరోనా వలలో చిక్కకుండా.. రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ ప్రాణ రక్షణ కోసమే మేం 24/7 విధుల్లో ఉంటున్నాం. భార్య, పిల్లలను, కుటుంబ సభ్యులను విడిచి.. మీ కోస మే పనిచేస్తున్నాం.. అర్థం చేసుకోండి.. అనవసరంగా రోడ్లపైకి రాకండి.. మీ ప్రాణాలను కాపాడుకొని.. ఇతరుల ప్రాణాలను కాపాడండని పోలీసులు కోరుతున్నారు.

ప్రజల సహకారం మరవలేనిది...

ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాం. వారు చెప్పే మాటలతోనే.. వారు చెబుతున్నది నిజమా, అబద్ధమా అని గుర్తు పట్టేస్తాం. అలాంటి వారిని రోడ్లపైకి అనుమతి ఇవ్వడం లేదు. మా విధులకు సలామ్‌ చేస్తూ ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిది. కొందరు వితండ వాదానికి దిగుతారు తప్పా... చాలా మంది చెప్పగానే వింటున్నారు. .

- ప్రవీణ్‌, కానిస్టేబుల్‌, బీహెచ్‌ఈఎల్‌ చెక్‌ పోస్టు

ప్రభుత్వానికి, డీజీపీ, సీపీలకు కృతజ్ఞతలు...

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీలు మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌లు అందిస్తున్న సహకారం మాకు మరింతగా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మేమంతా 24/7 డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులకు, కానిస్టేబుళ్లకు ఎప్పటికప్పుడు మాస్కులు, శానిటైజర్లు, డ్రైఫ్రూట్స్‌, వాటర్‌ బాటిళ్లు, సమయానికి భోజనం అందడంతో మాలో నిరుత్సాహం లేదు.

        - భద్రారెడ్డి, పోలీసు అధికారులు సంఘం అధ్యక్షుడు

ప్రజా సేవే ముఖ్యం...

ఇంత విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో మా పాత్ర కీలకంగా ఉండడం చాలా గర్వంగా ఉంది.  నిత్యం రోడ్లపై విధుల్లో ఉండడం వల్ల మాకు ఎక్కడ వ్యాధి సోకుతుందో అనే భయం కూడా ఉంది. అయినా ప్రజా సేవే .మాకు ముఖ్యం. పిల్లలను, కుటుంబ సభ్యులను విడిచి వస్తున్నాం... ప్రజలు అర్థం చేసుకోవాలి. మెడికల్‌ ఎమర్జెన్సీ ఉంటేనే వదులుతున్నాం. లేదంటే వెనక్కి పంపిస్తున్నాం. ఈ సమయంలో కొందరు వాగ్వాదానికి దిగి తిట్టినా.. మాకు అవి దీవెనలుగా భావిస్తాం. ప్రజల రక్షణే ధ్యేయం గా పనిచేస్తున్నాం. మా విధులను సక్రమంగా నిర్వర్తిస్తాం.

- ఇందిరా, ఏఎస్‌ఐ

గొడవకు దిగినా.. సముదాయిస్తాం..

 నా 28 ఏండ్ల సర్వీసులో ఇంత భయాందోళన కలిగించే రోగాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ సమయంలో ప్రజలను కాపాడుతుండడం నాకు మానసిక సంతృప్తిని ఇస్తుంది.  అనవసరంగా రోడ్లపై రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వారు గొడవకు దిగినా సముదాయించి వారు ప్రమాదంలో పడకుండా చూస్తున్నాం. కరోనా విస్తరించకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకరించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించి రాష్ర్టాన్ని కాపాడుకోవాలి. లాక్‌డౌన్‌ లక్ష్యాన్ని నెరవేర్చాలి.

- ఖాజా, కేశంపేట్‌ చెక్‌పోస్టు

జులాయిగా తిరిగేవారితోనే ఇబ్బంది..

గ్రామాల్లో కొంత మంది జులాయిగా తిరిగేవారితోనే ఇబ్బంది. చెప్పినా అర్థం చేసుకోరు. కొందరు తెలియక వాగ్వాదానికి దిగుతారు. నిత్యావసర సరుకుల కోసమని  బైక్‌లపై ఇద్దరు తిరుగుతున్నారు. అలాంటి వారితో కఠినంగా ఉంటున్నాం. గ్రామ పెద్దలకు చెప్పి గ్రామంలో ఎవరూ బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడడానికి  విధులు నిర్వహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేయడం, ప్రజల రక్షణకు కృషి చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం.ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా ధైర్యంగా పనిచేస్తాం.

- శివరాం, అడ్డగూడూరు చెక్‌పోస్టు

అవగాహన కల్పిస్తున్నాం...

లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి బీబీనగర్‌ టోల్‌ ప్లాజా వద్ద విధుల్లో ఉంటున్నా. రోజూ ఉదయం 8 గంటల నుంచి విధుల్లో ఉంటూ... తిరిగి రాత్రి 8 గంటలకు వెళ్లిపోతా. చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ.. కొందరు  ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు పాటించడం లేదు. అలాంటి వారికి అవగాహన కల్పించి... రూల్స్‌ పాటించేలా చేస్తున్నాం. వాళ్లు మా మీద అరిచినా ఓపికతోనే ఉంటాం. ఈ 25 రోజుల్లో దాదాపు 5 వేల మందికి అవగాహన కల్పించాం. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఈ విధంగా విధులు నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 

- చంద్రమ్మ, హెడ్‌ కానిస్టేబుల్‌, భువనగిరి


logo