బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 20, 2020 , 00:41:23

పింఛన్‌కు పోలీస్‌ భరోసా..!

పింఛన్‌కు పోలీస్‌ భరోసా..!

బన్సీలాల్‌పేట్‌, ఏప్రిల్‌ 19 : కొడుకుని చూడాలని సిరిసిల్ల నుంచి నగరానికి వచ్చిన ఓ వృద్ధురాలు లాక్‌ డౌన్‌తో ఇక్కడే ఉండిపోయింది. తనకు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ డబ్బులే ఆసరా అని, ప్రస్తుతం తాను సిరిసిల్ల వెళ్లలేనని,  పింఛన్‌  డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నది. బన్సీలాల్‌పేట్‌లోని గాంధీనగర్‌ కాలనీలో పోలీసులు నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అదే సమయంలో అమృత అనే వృద్ధురాలు తన ఆవేదనను ఎస్‌ఐ రవీందర్‌కు వివరించింది. సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌ పార్కు సమీపంలో తాను నివసిస్తానని, వితంతువునైన తనకు ప్రభుత్వం ఆసరా పథకంలో నెలకు రెండు వేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నదని చెప్పింది.  గాంధీనగర్‌ కాలనీకి ఫిబ్రవరి 21న వచ్చానని వివరించింది. సిరిసిల్లలోని ఇంటి సమీపంలోని పోస్టాఫీసులో పింఛన్‌ తీసుకుంటానని, మార్చి, ఏప్రిల్‌ రెండు నెలలు పింఛన్‌ తీసుకోకపోతే తన పింఛన్‌ నిలిపివేసారమోనని, దాంతో సిరిసిల్లకు ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదని చెప్పింది. దాంతో ఎస్‌ఐ రవీందర్‌ సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌ పార్కు పోస్టాఫీస్‌లో పనిచేసే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ నదీమ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అమృత హైదరాబాద్‌లో ఉన్నదని, లాక్‌ డౌన్‌తో  రవాణా సదుపాయం లేదని, ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, వచ్చే నెలలో మూడు నెలల పింఛన్‌ డబ్బులు అందించాలని కోరారు. తప్పకుండా ఆమెకు సహకరిస్తామని నదీమ్‌  హామీ ఇచ్చారని ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు. 


logo