శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 20, 2020 , 00:40:24

లాక్‌డౌన్‌లో గృహహింసలు..

లాక్‌డౌన్‌లో గృహహింసలు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో గృహిణులు గృహహింసలకు గురవుతున్నారు. మార్చి 23 నుంచి ఈ నెల 16 వరకు మొత్తం 522 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీంతో సైబరాబాద్‌ పోలీసులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో గృహిణులకు నరకం కనపడుతున్నది. ఇంట్లో మాటమాట పెరిగి వాగ్వాదాలు చోటుచేసుకోవడంతోపాటు పలు సందర్భాల్లో కొడుతున్నారని సమాచారం. భర్త, కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువకావడంతో...దాదాపు  522 మంది డయల్‌ 100కు ఫోన్‌చేసి కాపాడాలని వేడుకున్నారు. దీంతో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాల మేరకు.. సమస్యల పరిష్కారానికి  డీసీపీ అనసూయ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం బాధితులతో ఫోన్‌లో మాట్లాడి... సమస్య తెలుసుకుని...దానికి కారకులైన వారిని కూడా విచారించింది. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా.. దాదాపు 455 కేసులను పరిష్కరించింది. మరో 9 ఫిర్యాదులకు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయించింది. మరో 13 కేసులను షీ టీమ్స్‌కు అప్పజెప్పింది. 31 మంది బాధితులు స్పందించక పోవడంతో ఆ ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టారు. 14 కేసులను భరోసా కేంద్రానికి బదిలీ చేశారు.  బాధితులంతా డయల్‌ 100, సైబరాబాద్‌ వాట్సాప్‌ 9490617444లకు ఫిర్యాదు చేశారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫోన్‌: 9490617261కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్‌ సూచించారు. ఇలాంటి గృహ హింసలకు సంబంధించి డయల్‌ 100 ద్వారా సైబరాబాద్‌ పరిధికి చెందిన మహిళలు జనవరి నెలలో 1900, ఫిబ్రవరిలో 1600 ఫిర్యాదు చేశారు. ఇంత సంఖ్యలో గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీపీ సజ్జనార్‌... వాటి పరిష్కారానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.


logo