ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 20, 2020 , 00:40:00

20 రోజులు.. 100 కి.మీ

20 రోజులు.. 100 కి.మీ

  • శరవేగంగా  రోడ్ల పునరుద్ధరణ
  • రద్దీ లేకపోవడంతో చకచకా పనులు

నగరంలో రోడ్ల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు పనుల వేగాన్ని  పెంచారు. గత 20 రోజుల్లో 100 కిలోమీటర్ల మేర మెదటి లేయర్‌ ఏర్పాటు పనులు  పూర్తి చేశారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  నగరంలో రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం(సీఆర్‌ఎంపీ) కింద 709.49 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను ఐదేండ్ల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 1839.00 కోట్లతో ఏడు ప్యాకేజీల పనులను మంజూరు చేసిన విషయం విధితమే. జీహెచ్‌ఎంసీ టెండర్ల పద్ధతిలో ప్రైవేట్‌ ఏజెన్సీలకు పనులు కేటాయించింది. మొదటి ఏడాదిలో 50 శాతం రోడ్ల రీకార్పెటింగ్‌, రెండో సంవత్సరం 30 శాతం, మూడో సంవత్సరం మిగిలిన 20 శాతం రీకార్పెటింగ్‌ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన రెండేండ్లకు కేవలం నిర్వహణ మాత్రమే ఉంటుంది. రీకార్పెటింగ్‌తోపాటు గుంతల పూడ్చివేత, రోడ్లపై నిలిచే నీటిని తొలగించడం, పారిశుధ్య పనులు, యంత్రాల ద్వారా రోడ్లను స్వీపింగ్‌ చేయడం, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి తదితర పనులు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. అలాగే, నిర్వహణ పనుల్లో భాగంగా ఏటా పాడైన ప్రాంతాల్లో రోడ్లను బాగుచేయడం, లేన్‌ మార్కింగ్స్‌, ఫుట్‌పాత్‌ల పెయింటింగ్‌, సెంట్రల్‌ మీడియన్‌ల నిర్వహణ, రోడ్‌ సేఫ్టీ మార్కింగ్‌ల ఏర్పాటు తదితర పనులున్నాయి. అంతేకాకుండా ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియన్‌లలో పచ్చదనాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. ఈ ఐదేండ్లలో  ఇంకా ఏవైనా అదనపు పనులు చేపట్టాల్సి వస్తే అంచనా వ్యయం ప్రకారం సదరు సంస్థలే నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి జీహెచ్‌ఎంసీ అదనంగా చెల్లింపులు జరుపుతుంది. రోడ్ల తవ్వకాలపై అనుమతించే అధికారాన్ని ఆయా ప్రైవేట్‌ ఏజెన్సీలకే అప్పగించారు. జోనల్‌ కమిషనర్లకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పనుల నాణ్యతను జీహెచ్‌ఎంసీ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంతోపాటు థర్డ్‌పార్టీ ఏజెన్సీలు పరిశీలిస్తాయి.

రోజుకు 10 కిలోమీటర్ల లక్ష్యం...

గత నెల 28న పనులు ప్రారంభమయ్యాయి. అంటే, సరిగ్గా 20 రోజుల్లో ఈనెల 16వతేదీ నాటికి 98 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తికాగా, శుక్రవారం నాటికి  మరో ఆరు కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో 100 కిలోమీటర్లకుపైగా పనులు జరిగాయి. రోజుకు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ తెలిపారు. త్వరలో  రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వచ్చే జూన్‌ నాటికి కనీసం 331 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లపై మొదటి లేయర్‌ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పనులు అదే స్థాయిలో కొనసాగుతున్నాయని  వివరించారు. 

మొదటి లేయర్‌  పూర్తయిన రోడ్లు..

ఎల్బీనగర్‌ జోన్‌లో.. చక్రీపురం, ఎన్‌ఎఫ్‌సీ బ్రిడ్జి, ఉప్పల్‌ బస్టాప్‌, టీకేఆర్‌ కాలేజ్‌ కమాన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌, చార్మినార్‌ జోన్‌.. అంబర్‌పేట్‌ కాజ్‌వే, నల్గొండ క్రాస్‌రోడ్స్‌, దారుషిఫా సర్కిల్‌, ఐఎస్‌ సదన్‌ క్రాస్‌రోడ్స్‌, ఒవైసీ హాస్పిటల్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ డీఆర్‌డీఎల్‌, హరిబౌలీ క్రాస్‌రోడ్స్‌, ఆశా టాకీస్‌, పురానాపూల్‌, నైస్‌ హోటల్‌, తాడ్‌బన్‌ క్రాస్‌రోడ్స్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నం-117, ఓఆర్‌ఆర్‌ పిల్లర్‌ నం-294, ఖైరతాబాద్‌-1 జోన్‌లో..విజయనగర్‌ కాలనీ, సంజీవయ్య విగ్రహం, జీహెచ్‌ఎంసీ అబిడ్స్‌ ఆఫీస్‌, బషీర్‌బాగ్‌ కళాంజలి, ఖైరతాబాద్‌-2 జోన్‌లో.. అయోధ్య జంక్షన్‌, మెర్క్యూర్‌ హోటల్‌, ఇక్బాల్‌ మినార్‌, శేరిలింగంపల్లి జోన్‌లో.. యూనివర్సెల్‌ రెస్టారెంట్‌, విజేత థియేటర్‌, రాజీవ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌, లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్‌, దర్గా జంక్షన్‌, కొత్తగూడ జంక్షన్‌, మినీ చార్మినార్‌, హైటెక్‌సిటీ, బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌, కూకట్‌పల్లి జోన్‌లో.. రోడ్‌ నం-65, రంగ బంజారా థియేటర్‌, ఐడీపీఎల్‌ జంక్షన్‌, గాజుల రామారం, తెలంగాణతల్లి విగ్రహం, సికింద్రాబాద్‌ జోన్‌లో.. మారియట్‌ హోటల్‌, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌, భోలకపూర్‌ ఎన్‌టీపీసీ బిల్డింగ్‌, కవాడిగూడ గోషాల జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ తదితర ప్రాంతాలు.logo