బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 20, 2020 , 00:29:25

చిన్నారులను కబళించింది

చిన్నారులను కబళించింది

  • కరోనాతో ఇద్దరు మృతి 
  • గాంధీలో 45 రోజుల పాప
  • నిలోఫర్‌లో 11 నెలల బాలుడు క్వారంటైన్‌కు 
  • ఈఎస్‌ఆర్‌ వార్డు రోగులు
  • కలకలం రేపుతున్న మరణాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అభంశుభం తెలియని చిన్నారులను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. నారాయణపేట జిల్లాకు చెందిన 45 రోజుల వయసు గల చిన్నారి న్యుమోనియాతో బాధపడుతుండటంతో అక్కడి వైద్యులు నిలోఫర్‌కు రిఫర్‌ చేశారు. ఈనెల 15న సదరు చిన్నారిని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స చేశారు. అయితే చిన్నారికి కరోనా లక్షణాలు ఉండటంతో కొవిడ్‌ పరీక్షల కోసం పంపించారు. 17వ తేదీన కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వెంటనే గాంధీకి తరలించారు. ఆదివారం సదరు చిన్నారి మృతిచెందింది. మరోవైపు ఆసిఫ్‌నగర్‌ గంజెషాహి దర్గా ప్రాంతానికి చెందిన 11 నెలల బాలుడికి అనారోగ్యం కలగడంతో అతన్ని నిలోఫర్‌లో చేర్పించారు. సదరు బాలుడు శనివారం మృతిచెందగా.. ఆదివారం వచ్చిన రిపోర్టుల్లో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

20 మంది రోగులు క్వారంటైన్‌కు..

పాజిటివ్‌ శిశువు చికిత్స పొందిన వార్డులో ఉన్న ఇతర చిన్నారులు, వారి తల్లులు మొత్తం సుమారు 20మంది రోగుల నుంచి శాంపిల్స్‌ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. నివేదికలు వచ్చే వరకు 20మంది రోగులను క్వారంటైన్‌కు తరలించినట్లు వివరించారు. అయితే అత్యవసర విభాగంలోని వైద్యులందరికీ పీపీఈ కిట్స్‌ అందచేశామని, వైద్యసిబ్బంది అంతా కిట్స్‌ ధరించి ఉండడంతో వారిని ఎలాంటి ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించడం లేదన్నారు. అయితే పాజిటివ్‌ చిన్నారి చికిత్స పొందిన వార్డులో విధులు నిర్వర్తించిన సుమారు 14 మంది సిబ్బంది నుంచి కూడా శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలకు పంపనున్నట్లు సూపరింటెండెంట్‌ స్పష్టం చేశారు.

నలుగురికి పాజిటివ్‌

ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మెహిదీపట్నంలో ఒకరికి, గుడిమల్కాపూర్‌లో ఒకరికి, జేబాబాగ్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

ఒకే కుటుంబంలో ముగ్గురికి

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 31 మంది రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.  ఈ నెల 16న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉండే ఓ వృద్ధురాలు (64) తీవ్ర అనారోగ్యంతో మరణించింది. అదే రోజు  స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మరుసటి రోజు ఈ విషయం వెలుగుచూడటంతో ఆమె బంధువులు ఎనిమిది మందిని గాంధీ దవాఖానకు తరలించారు.  ఆదివారం మృతురాలి  పెద్ద కుమార్తె (45),  (7), (5) వయస్సు ఉన్న  మనుమరాండ్లకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఇతర కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారిని మొత్తం 31 మందిని  గాంధీ, సరోజినీదేవి దవాఖానల్లోని ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. 

23 రోజుల తర్వాత

గత నెల 26న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన ఓ వృద్ధుడు తీవ్ర అస్వస్థతతో లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం నుంచి నమూనాలు సేకరించగా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. సరిగ్గా 23 రోజుల తర్వాత ఈ నెల 16న అదే కాలనీలో నివసించే ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో మరణించింది. కాగా ఆమె కూడా అదే దవాఖానలో చికిత్స పొందినట్లు సమాచారం.

కేపీహెచ్‌బీ కాలనీలో యువకుడికి...

కేపీహెచ్‌బీ కాలనీ :  కేపీహెచ్‌బీ కాలనీలోని స్నేహితుడి ఇంట్లో నివసిస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాకు చెందిన  యువకుడు  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 2 నుంచి స్నేహితులతో ఉంటున్నాడు. ప్రస్తుతం అతని ముగ్గురు స్నేహితులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. 

43 మంది క్వారంటైన్‌కు

నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్‌నగర్‌ గంజెషాహి దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ ప్రాంతం నుంచి ఆదివారం రాత్రి సుమారు 31 మంది కరోనా అనుమానితులను చికిత్స కోసం వివిధ ఆసుపత్రులకు తరలించారు. కేపీహెచ్‌బీకాలనీ వార్డు కార్యాలయంలో నివసించే ఓ యువతికి కరోనా లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్‌కు తరలించారు. కామాటిపురా ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తికి  పాజిటివ్‌ రాగా.. అతడితో కలివిడిగా ఉన్న 11 మందిని ఆదివారం వైద్యశాలకు తరలించారు.

ముగ్గురు డిశ్చార్జి..

ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కరోనా నుంచి కోలుకొని  డిశ్చార్జి అయ్యారు.  పంజాగుట్టకు చెందిన ఇద్దరు, లక్డీకాపూల్‌కు చెందిన ఒకరిని ఆదివారం డిశ్చార్జి చేసినట్లు అధికారులు తెలిపారు. 

అంత్యక్రియలు పూర్తి..

సనత్‌నగర్‌ జోన్‌ బృందం : పది రోజుల క్రితం కరోనాతో మృతి చెందిన  బన్సీలాల్‌పేట్‌కు చెందిన  వ్యక్తి అంత్యక్రియలు  జీహెచ్‌ఎంసీ యంత్రాంగం నిబంధనల మేరకు నిర్వహించింది. మృతదేహాన్ని వాటర్‌, ఎయిర్‌ ప్రూఫ్‌  జిప్‌ ఫోల్డర్‌లో భద్రపర్చి హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసి అంబులెన్స్‌లో తరలించారు. అంత్యక్రియలకు  భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బస్తీ పెద్దలను అనుమతించారు.

నిలోఫర్‌లో కలకలం...

నిలోఫర్‌లో కరోనా మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మృతిచెందిన ఇద్దరు చిన్నారులు నిలోఫర్‌లోనే చికిత్స పొందడంతో వైద్య సిబ్బందితో పాటు, రోగులు ఉలిక్కిపడ్డారు. అయితే దవాఖానకు చెందిన వైద్యులందరినీ క్వారంటైన్‌కు పంపుతున్నట్లు వదంతులు చెలరేగాయి. అయితే దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్‌ ఉన్నాయని, వారు రొటీన్‌ క్వారంటైన్‌కు మాత్రమే వెళుతున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డా.మురళీకృష్ణ వివరణ ఇవ్వడంతో అయోమయానికి తెరపడింది. 

గ్రేటర్‌లో 17పాజిటివ్‌ కేసులు.. 

 గ్రేటర్‌లో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతున్నది. తాజాగా ఆదివారం మరో 17కేసులు నమోదయ్యాయి. వీటిలో 15కేసులు హైదరాబాద్‌ నగరంలోనే నమోదవగా రెండు కేసులు మేడ్చల్‌ జిల్లాలోని నేరేడ్‌మెట్‌ సాయికాలనీలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో నమోదైన 15కేసుల్లో పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్‌లో నాలుగు కేసులు, నాంపల్లిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో రాత్రి 8గంటల వరకు 136మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.శశికళ తెలిపారు. మరో 58 మందికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు.

స్విగ్గీ డెలివరీ బాయ్‌కి...

సుల్తాన్‌బజార్‌ : రెడ్‌హిల్స్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతని సోదరుడు మర్కజ్‌కు వెళ్లి రావడంతో కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌ చేశారు. అయితే సదరు డెలివరీ బాయ్‌ మార్చి 19న ఒక రోజు మాత్రమే డెలివరీ చేశారు. తాజాగా అతనికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఎవరెవరికి డెలివరీ చేశారని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతని కుటుంబంలో మరో నాలుగేండ్ల బాలుడికి కూడా కరోనా వ్యాధి ఇదివరకే నిర్ధారణ అయ్యింది.

జిల్లా దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు 

కొండాపూర్‌ : కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో 20 పడకలతో ఐసోలేషన్‌ వార్డును అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా మహమ్మారిని అరికట్టే దిశగా జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో దవాఖానలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్‌ దశరథ్‌ తెలిపారు. కరోనా లక్షణాలతో ఉన్న వారికి చికిత్సను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణతో పాటు ఐసోలేషన్‌కు వచ్చే రోగులను అన్ని విధాలుగా పరీక్షించి అవసరమైన చికిత్సలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటుగా దవాఖాన ప్రాంగణంలో శానిటైజర్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


logo