శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 18, 2020 , 23:33:14

వైద్యులపై దాడిచేస్తే కఠిన చర్యలు

వైద్యులపై దాడిచేస్తే కఠిన చర్యలు

  • దాడి చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక సెల్‌
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

అంబర్‌పేట : విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నారాయణగూడలోని ఐపీఎంను మంత్రి శనివారం సందర్శించి..  వైద్య సేవలను ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌, ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్‌ ప్రధాని తనకు ఏ దేవుడు లేడని, వైద్యుడే దేవుడని పేర్కొన్నారని, అలాంటి వైద్యులపై కొందరు దుర్మార్గులు, శాడిస్టులు దాడి చేస్తున్నారని అన్నారు. వైద్యులు, సిబ్బందిపై దాడిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. డాక్టర్లు, సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని, వారి కుటుంబాలను కూడా పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, వారిపై పేషెంట్లు, వారి బంధువులు దాడి చేయడం క్షమించరాని నేరమన్నారు. కరోనా వ్యాప్తి చెందిన వారిలో కొందరు తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని, అలాంటి వారికి రక్తం చాలా అవసరమని, రక్తం కొరత రాకుండా రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.  టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, కార్యదర్శి మామిండ్ల రాజేందర్‌, భాగ్యనగర్‌ టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌, శ్రీనివాస్‌రావు  పాల్గొన్నారు.


logo