బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 18, 2020 , 23:27:25

విపత్తులో భరోసా

విపత్తులో భరోసా

  • ఆపదలో ఆదుకుంటున్న బస్తీ దవాఖానలు 
  • రవాణ లేకున్నా కాలినడకన వెళ్లే వెసులుబాటు
  • గ్రేటర్‌లో సేవలందిస్తున్న 120 దవాఖానలు
  • ప్రతిరోజు 5 వేలకు పైగా రోగులకు వైద్యసేవలు
  • అందుబాటులో 55రకాల వైద్యపరీక్షలు
  • 40 శాతం వ్యాధులను 
  • ప్రాథమిక స్థాయిలోని నియంత్రించే వైద్యం
  • ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ అందుబాటులో ఓపీ సేవలు

ఆపదలో ఆదుకున్నవాడే ప్రత్యక్ష దైవం. అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు సేవలు    అందించడం పెద్ద గొప్పేం కాదు. ఎవరూ లేనప్పుడు అందుబాటులోకి రావడం ఆపద్బాందువుల లక్షణం. లాక్‌డౌన్‌ అనేది ప్రజలకే.. రోగాలకు కాదు. మరి పరిస్థితులతో సంబంధం లేకుండా వచ్చే రోగాల నుంచి ఈ ఆపత్కాలంలో ప్రజలను బస్తీ దవాఖానలే కాపాడుతున్నాయి. కొవిడ్‌ -19తో గ్రేటర్‌కు తాళం పడింది. కార్పొరేట్‌ దవాఖానలతో పాటు చిన్నపాటి ప్రైవేటు క్లీనిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు సైతం మూతపడ్డాయి. ఉస్మానియా, నిలోఫర్‌ వంటి ట్రెషరీ దవాఖానలు పనిచేస్తున్నా అంత దూరం వెళ్లాలంటే రవాణా వ్యవస్థతో సహా అన్నీ స్థంభించాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేనున్నాంటు బరోసా ఇస్తున్నాయి మన బస్తీ దవాఖానలు. గ్రేటర్‌ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 120 దవాఖానల్లో 55రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ 40 రకాల రోగాలకు 125 మందులను అందజేస్తూ ప్రాథమిక స్థాయిలోనే నియంత్రిస్తున్నారు. దీంతో పట్నం వాసులకు అండగా నిలుస్తున్న బస్తీ దవాఖానల తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

-నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో

లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయట అన్నిరకాల ప్రైవేటు దవాఖానలు, క్లీనిక్‌లు, వైద్యపరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిటిక్‌ సెంటర్లు సైతం మూసి ఉన్న వేళ గ్రేటర్‌ పరిధిలో 120బస్తీ దవాఖానలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 73, రంగారెడ్డి జిల్లా పరిధిలో 22, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 25 బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు అందిస్తున్నట్లు ఆయా జిల్లాల వైద్యాధికారులు స్పష్టం చేశారు. ప్రతి బస్తీ దవాఖానలో వైద్యపరీక్షలతో పాటు మందులను అందచేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నగరంలో సరాసరి 50 - 60 మందికి ఓపీ సేవలు

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 73 బస్తీ దవాఖానలు ఉన్నాయి. ఒక్కో దవాఖానలో  ప్రతిరోజూ సరాసరి 50 నుంచి 60మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జె.వెంకటి తెలిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు పెద్దగా బయటకు రాలేకపోయినా తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు బస్తీదవాఖానలను ఆశ్రయిస్తున్నారన్నారు. రోగులకు అవసరమైన వైద్యపరీక్షలు చేయడంతో పాటు మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. 

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో..

రంగారెడ్డి జిల్లాలో 22 బస్తీ దవాఖానలు స్థానిక ప్రజలకు సేవలందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ప్రతి దవాఖానలో రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు. అన్ని రకాల జాగ్రత్తలతో ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.  మేడ్చల్‌ జిల్లాలో 25 బస్తీ దవాఖానలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వీరాంజనేయులు తెలిపారు. బస్తీ దవాఖానల్లో పనిచేసే కొందరు సిబ్బంది క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లినప్పటికీ రోగులకు ఇబ్బంది కలుగకుండా అన్ని బస్తీ దవాఖానల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. 

55 రకాల వైద్యపరీక్షలు 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఏవైనా వైద్యపరీక్షలు చేయించాలంటే బయట డయాగ్నోస్టిటిక్‌ సెంటర్లన్నీ మూసిఉన్నాయి. ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో బస్తీదవాఖానలు అన్నీ తానై సేవలందిస్తున్నాయి. ఇక్కడ రోగులకు బీపీ, షుగర్‌, మలేరియా, టైఫాయిడ్‌, థైరాయిడ్‌ తదితర 55రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.  

125 రకాల మందులు 

రోగులకు ప్రాథమికంగా అవసరమయ్యే మందులతో పాటు కొన్ని రకాల అత్యవసర మందులతో కలిపి మొత్తం 125 రకాల మందులను బస్తీ దవాఖానలో అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ మందులు దాదాపు 40 శాతం వ్యాధులకు పనిచేస్తాయని, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలోని వ్యాధులను నియంత్రిస్థాయని వైద్యాధికారులు తెలిపారు.

ఆరోగ్య పరంగా ఆపద రానివ్వం

ప్రజలకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఆపద రానివ్వం. కరోనా విధులు నిర్వహిస్తూనే సాధారణ ప్రజానికానికి సైతం బస్తీ దవాఖానల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నాం.  ఎందుకంటే బస్తీ దవాఖానల కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు.  ఇండ్ల మధ్యనే ఉండడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగ పడుతున్నాయి. 

-డా.స్వరాజ్యలక్ష్మి, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రంగారెడ్డి జిల్లా

ప్యాదోళ్లకు ప్రాణం పోస్తుండ్రు

నేను డ్రైవింగ్‌ చేస్తాను. రెండ్రోజుల నుంచి తలనొప్పి, వాంతులు. చేతుల చిల్లి గవ్వలేదు. నా పెద్దకొడుకును తీసుకుని మా ఇంటికి దగ్గర్లో ఉన్న బస్తీ దవాఖానకు పోతే మూడ్రోజులకు మందులు ఇచ్చిండ్రు. ఇప్పుడు పానం కులాసగ ఉంది. ఈ దవాఖాన లేకుండా మాలాంటి ప్యాదోళ్ల ప్రాణాలకు కష్టమే ఉండేది. 

-పెట్రోల్‌ రాజు 

రియల్లీ ఐ ఆమ్‌ సర్‌ప్రైజ్డ్‌

అమ్మ వయస్సు 60 ప్లస్‌. బీపీ ఎక్కువైంది. టెన్షన్‌ పడ్డాం. నేను ఎప్పుడూ మా ఫ్యామిలీ డాక్టర్‌నే కన్సల్ట్‌ చేస్తా. లాక్‌డౌన్‌ ఉండడంతో ఆయన అందుబాటులో లేరు. మా ఇంట్లో పనిచేసే ఆంటీ చెప్పడంతో పక్కనే ఉన్న ఎన్‌బీటీ నగర్‌లోని బస్తీ దవాఖానకు తీసుకెళ్లాం. అక్కడే టెస్టులు చేసి, మందులు ఇచ్చారు. జస్ట్‌ త్రీ హవర్స్‌లో మా అమ్మ క్యూర్‌ అయ్యారు. ఐ రియల్లీ అప్రిషియేట్‌ గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌.

-మనీష్‌, బంజారాహిల్స్‌ logo