బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 18, 2020 , 23:12:12

ఇలా.. ఉల్లంఘించారు

ఇలా.. ఉల్లంఘించారు

  • నియంత్రిత జోన్లతో కరోనా కట్టడి
  • అందరూ నిబంధనలు పాటించాలి

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కొందరు నిబంధనలు అతిక్రమించి.. వారికి తెలియకుండానే వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ.. కుటుంబ సభ్యులతో పాటు అమాయకులకు కొవిడ్‌-19ను వ్యాపింపజేస్తున్నారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. కొందరు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారు. కుటుంబసభ్యులతో పాటు పక్కవారికీ వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారు.  రాజేంద్రనగర్‌లో ఒక ఉల్లిగడ్డల వ్యాపారికి, అతడి భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. సదరు వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించడంతోనే వ్యాధి వ్యాపించినట్లు తేలింది. దీంతో అతడిని సంప్రదించిన సుమారు 40 మందిని ఐసోలేషన్‌ చేయాల్సి వచ్చింది.

వైరస్‌ కట్టడికే నియంత్రిత జోన్లు..

 కొవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం,  కొత్తగా ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనా ఆ ప్రాంతంలో కనీసం 100 ఇండ్లను కంటైన్‌మెంట్‌ చేస్తూ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.  ఇప్పటికే నగరంలో 146 చోట్ల నియంత్రిత జోన్లను ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల నుంచి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. అలాగే బయటి వ్యక్తులను  ఆ ప్రాంతాలకు అనుమతించడం లేదు.

తప్పించుకుని..

దుండిగల్‌, నమస్తేతెలంగాణ: క్వా రంటైన్‌కు వెళ్లకుండా తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్లిన మహిళ.. మరో ఐదుగురికి వైరస్‌ వ్యాప్తికి కారణమైంది. గాజులరామారం సర్కిల్‌ చంద్రగిరి నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి మార్చి 24న కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ ఈనెల 2 వ తేదీన  మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో మరో నలుగురికి, మరో కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌గా వచ్చింది. క్వారంటైన్‌కు తరలించే క్రమంలో మృతుడి చిన్న కోడలు ఏడాదిన్నర కొడుకుతో  సూరారం డివిజన్‌ పరిధిలోని కళావతినగర్‌లోని ఆమె  పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా ఆమె పుట్టింటికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వీరిని క్వారంటైన్‌కు తరలించే క్రమంలో ఆమె తన ఏడాదిన్నర కుమారితో మరో సారి తప్పించుకొని వారి బంధువుల ఇంట్లో తలదాచుకున్నది. ఎట్టకేలకు  జహంగీర్‌ బస్తీలో ఈనెల 14న అధికారులకు పట్టుపడింది. వెంటనే ఆమెను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె నిర్లక్ష్యం తో కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

బాధ్యతతో వ్యవహరించాలి..

కరోనాను తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి నిబంధనలు పాటించాలి. లేకుంటే లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితులు  వస్తాయి.  ట్రావెల్‌ హిస్టరీ ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.  ఈ నెలాఖరుకల్లా కరోనాను నియంత్రణలోకి తేవాలనే సంకల్పంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటుంది.

-  బొంతు రామ్మోహన్‌, మేయర్‌


logo