బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 18, 2020 , 23:10:23

నాలుగున్నర వేలమందికి..‘ఆశ్రయం’

నాలుగున్నర వేలమందికి..‘ఆశ్రయం’

  • జీహెచ్‌ఎంసీ షెల్టర్‌ హోమ్‌లలో భోజనం, సకల వసతులు, వైద్య పరీక్షలు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో ఇందుకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా యాచకులు, అనాథలు, దవాఖానలకు వచ్చినవారు, ఫుట్‌పాత్‌లు, చెట్ల కింద ఉండేవారు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కాలం వెళ్లదీసేవారు, వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చి ఇక్కడే చిక్కుకుపోయినవారు తదితరులకు షెల్టర్‌ హోమ్‌లలో ఆశ్రయం కల్పించింది. 

4565 మందికి ఆశ్రయం

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని 12 షెల్టర్‌ హోమ్‌లలో 228 మందికి, అలాగే, 13 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెల్టర్లలో 1157మందికి ఆశ్రయం కల్పించారు. అంతేకాకుండా 85 స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిన్నచిన్న కమ్యూనిటీ హాళ్లు, వసతి గృహాల్లో 3180 మందికి వసతి కల్పించారు. ఇలా మొత్తం 4565మందికి ఆశ్రయం కల్పించి వారికి భోజనం, శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు అందిస్తున్నారు. అలాగే, దాతల సహకారంతో దుప్పట్లు, దుస్తులు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి చెందిన 16మంది సహాయ వైద్యాధికారులు, బస్తీ దవాఖానల్లోని వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా షెల్టర్‌లలో ఉన్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియను ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ ముఖ్య వైద్యాధికారి డా.అమర్‌ను దీనిపై పర్యవేక్షకుడిగా నియమించారు. ఈ కేంద్రాలను జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు తరచూ తనిఖీ చేస్తున్నట్లు, షెల్టర్‌ హోమ్‌లలో సామాజిక దూరాన్ని పాటించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు వారు వివరించారు. 


logo