శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 18, 2020 , 23:07:54

గీత దాటితే.. పట్టివేతే

గీత దాటితే.. పట్టివేతే

  • కాలు బయట పెడితే చాలు..  క్షణాల్లో వచ్చి కట్టడిచేస్తారు
  • కంటైన్‌మెంట్‌లలో ఉన్నవారిపై నిఘా కోసం ప్రత్యేక అప్లికేషన్‌ 
  • అన్ని క్వారంటైన్‌ కేంద్రాలకు జియో ట్యాగింగ్‌
  • అందరి జాబితాతో సమాచార నిధి
  • ఇప్పటికే పూర్తయిన ట్రయల్‌..

రాష్ట్రంలో ఇక కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడే కట్టడి చేయనున్నారు. ఇందుకు పోలీసులు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు, క్వారంటైన్‌లో  ఉన్నవారిపై ప్రత్యేక నిఘా కోసం కొత్త అప్లికేషన్‌ను తయారుచేశారు. ఇందులో ఉన్నవారు కాలుబయట పెడితే.. వెంటనే తెలిసిపోయేలా దీన్ని రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని క్వారంటైన్‌ కేంద్రాలను  జియో ట్యాగింగ్‌ చేసి.. పోలీసుల హాక్‌ ఐకి అనుసంధానం చేశారు. దీంతో క్వారంటైన్‌లో ఉన్నవారితో పాటు కంటైన్‌మెంట్‌ ప్రాంతాల సమాచారం ప్రజలకు తెలియనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ అప్లికేషన్‌ను ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.  

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్‌ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే...  వెంటనే పోలీసులకు  సమాచారం వస్తుంది. అలాగే క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బందితో పాటు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉండే వారికి కూడా తెలిసిపోతుంది. దీంతో క్షణాల వ్యవధిలోనే సంబంధిత వ్యక్తిని బయటకు వెళ్లకుండా కట్టడి చేయనున్నారు.  అలాగే  కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పోలీసులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. ఇతరులకు వ్యాపించకుండా కృషి చేస్తున్నారు. 

కొత్త అప్లికేషన్‌ పనిచేసేది ఇలా..

పాజిటివ్‌ వచ్చిన వారిని దవాఖానలకు తరలించి.. వారికి సంబంధించిన వారిని క్వారంటైన్‌ చేస్తున్నారు. వీరి సమాచారంతో తయారు చేసిన కొత్త అప్లికేషన్‌ను క్వారంటైన్‌లో ఉండేవారి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేస్తారు. అలాగే క్వారంటైన్‌ సెంటర్‌కు, అందులో ఉన్న వారికి అనుసంధానం చేస్తూ జియో ట్యాగింగ్‌ చేస్తారు. అయితే క్వారంటైన్‌లోని వ్యక్తి  బయటకు వచ్చి..50 మీటర్ల పరిధి దాటుతుండగానే సంబంధిత వ్యక్తితో పాటు పోలీసులకు సమాచారం ఇస్తుంది. దీంతో తాను 50 మీటర్ల పరిధి దాటుతున్నాననే విషయం సంబంధిత క్వారంటైన్‌లోని వ్యక్తికి తెలిసిపోయి..వెంటనే వెనక్కి వెళ్లే అవకాశముంటుంది. ఒకవేళ అతను వెనక్కి వెళ్లకపోతే వెంటనే పోలీసులు గుర్తించి.. కార్వంటైన్‌కు తరలిస్తారు. ఇదంతా జీపీఎస్‌ ఆధారంగా పనిచేస్తుందని ఐటీ అధికారులు పేర్కొన్నారు. 

హాక్‌ ఐతో అనుసంధానం..

క్వారంటైన్‌లో ఉన్న వారితో పాటు కంటైన్‌మెంట్‌ ప్రాం తాలకు సంబంధించిన సమాచారం కూడా కొత్త అప్లికేషన్‌లో ఉంటుంది. దీంతో ఈ అప్లికేషన్‌ను హాక్‌ఐతో లింక్‌ చేస్తున్నారు.  హాక్‌ ఐని  30 లక్షలకుపైగా యూజర్లు ఉపయోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారంటైన్‌ సెంటర్లతో పాటు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలకు సంబంధించిన స మాచారం ప్రజలకు తెలిసిపోతుంది. కంటైన్‌మెంట్‌ ప్రాం తాల్లోనివారు బయటకు రాకుండా.. బయటి వారు అక్కడకు వెళ్లకుండా ఆయా ప్రాంతాలను దిగ్బంధం చేశారు.  కొత్త అప్లికేషన్‌తో ఈ విషయం యూజర్లకు తెలియడంతో మరో రూట్‌లో వెళ్తారు. దీంతో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణలో ఉండేందుకు అవకాశముంటుంది.

పాతబస్తీలో నగర సీపీ పర్యటన

చాంద్రాయణగుట్ట,  నమస్తే తెలంగాణ: పాతబస్తీ ఆల్‌ ముస్తాఫానగర్‌లో కంటైన్‌మెంట్‌ ఏరియాలో శనివారం మధ్యాహ్నం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పర్యటించారు. ఈ బస్తీకి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా.. ఆమెను వైద్యశాలకు తరలించి.. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా సీపీ ఆ బస్తీలో పర్యటించి మాట్లాడుతూ.. క్వారంటైన్‌లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులతో పాటు  ఇతర  ఏ అవసరాలు ఉన్నా జీహెచ్‌ఎంసీ అధికారులు లేదా ఇతర అధికారులు వారికి అందేలా చూస్తున్నారన్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు.


logo