గురువారం 28 మే 2020
Hyderabad - Apr 17, 2020 , 23:38:57

గ్రేటర్‌లో మరో 43 పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో మరో 43 పాజిటివ్‌ కేసులు

  • హైదరాబాద్‌లోనే 37 కేసులు
  • తలాబ్‌ కట్టాలోని ఒకే కుటుంబంలో 29మందికి పాజిటివ్‌

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : నగరంలో కరోనా విజృంభిస్తున్నది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66 కేసులు నమోదు కాగా అందులో కేవలం నగరంలోనే 37 కేసులు నమోదయ్యాయి. గురువారం నగరంలో 32 కేసులు నమోదవ్వగా, తాజాగా కేసుల సంఖ్య 37కు పెరగడం కలవరపెడుతున్నది. 17 కేసులు పాతబస్తీ, తలాబ్‌కట్టలోని ఒకే కుటుంబంలో నమోదు కావడం స్థానికంగా వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతున్నది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ జాగీర్‌లో 2 కేసులు, మేడ్చల్‌ జిల్లాలోని నేరేడ్‌మెట్‌లో ఒకటి, కుత్బుల్లాపూర్‌లో ఒకటి, కీసరలోని చీర్యాలలో ఒకటి, అల్వాల్‌లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రేటర్‌ వ్యాప్తంగా మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. 

ఒకే కుటుంబంలో 29 మందికి..

పాతబస్తీ తలాబ్‌కట్టకు చెందిన ఒకే కుటుంబంలో 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గతంలో 12 మందికి పాజిటివ్‌ కేసులు రాగా శుక్రవారం అదే కుటుంబంలోని మరో 17 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నగరంలో నమోదైన కుటుంబాల్లో  29మంది పాజిటివ్‌ సభ్యులు గల పెద్ద కుటుంబంగా నిలిచింది. ఈ కుటుంబానికి చెందిన వారు మర్కజ్‌ వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. తలాబ్‌కట్టకు చెందిన సదరు కుటుంబ సభ్యుల్లో మరికొంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, కిషన్‌బాగ్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


logo