బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 17, 2020 , 23:31:02

పుడమినేలుతున్న నిశ్శబ్దం

పుడమినేలుతున్న నిశ్శబ్దం

  • లాక్‌డౌన్‌తో తగ్గిన  శబ్ద కాలుష్యం..
  • హైదరాబాద్‌లో 1960 నాటి పరిస్థితి
  • ఎన్‌జీఆర్‌ఐ పరిశోధనల్లో వెల్లడి 
  • భూ, భౌతిక పరిశోధనలకు కొత్త మలుపు

లాక్‌డౌన్‌తో కరోనా వైరస్‌ కట్టడి కావడమే కాదు... ప్రకృతి పరంగా కూడా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శబ్ద, వాయు కాలుష్యం తగ్గడంతో పుడమి తల్ల్లి పులకరిస్తున్నది. భూమి లోపల పొరల్లోని శబ్ద తరంగాలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. వందల కిలోమీటర్ల దూరంలో  ప్రకంపనలు వచ్చినా... సూక్ష్మంగా కంపించినా, అలికిడిలు సైతం  హైదరాబాద్‌లోని భూ,భౌతిక పరిశోధనా సంస్థ’(ఎన్‌జీఆర్‌ఐ)లోని రిక్టర్‌ స్కేల్‌పై నమోదవుతున్నాయి. నగరంలో దాదాపు 60 సంవత్సరాల నాటి పరిస్థితి పునరావృతమవుతున్నది.. 

 - ప్రత్యేక ప్రతినిధి, నమస్తేతెలంగాణ 

మార్చి 22న జనతా కర్ఫ్యూతో పాటు ఆ తర్వాత నిరవధిక లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌ వంటి మహానగరాలతో పాటు పట్టణాల్లో వాహనాల రాకపోకలు లేకపోవడం, జన సంచారం తగ్గడం వల్ల శబ్ద కాలుష్యం దాదాపు నాలుగురెట్లు తగ్గింది. ప్రత్యేకంగా భూకంపాలపై పరిశోధన జరిపే ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల పరిశీలనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.  హైదరాబాద్‌ హబ్సిగూడలో 1961లో ఏర్పాటైన నేషనల్‌ జియో ఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) జాతీయ స్థాయిలో భూ, భౌతిక పరిశోధనలను చేస్తున్నది. ఈ సంస్థ రాష్ట్రంలో 60 ఏండ్ల కింద నాటి పరిస్థితులు పునరావృతమైనట్లు గమనించింది. మొదట ఈ సంస్థ ఏర్పాటైనప్పుడు వాహనాల రాకపోకలు, జన సంచారం తక్కువగా ఉండడం వల్ల 300 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో భూమిలో ఏర్పడ్డ చిన్న ప్రకంపనలు కూడా రిక్టర్‌ స్కేల్‌పై నమోదయ్యేవి. కానీ రాను రానూ పరిస్థితి మారింది. హైదరాబాద్‌లో స్వల్ప ప్రకంపనలు కూడా రిక్టర్‌ స్కేల్‌పై సరిగ్గా నమోదు కాని పరిస్థితి. ఎందుకంటే శబ్ద కాలుష్యం అనూహ్యంగా పెరగడమే. లాక్‌డౌన్‌ వల్ల 60 ఏండ్ల కిందనాటి పరిస్థితి తిరిగి ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌లో ఒకేసారి శబ్ద కాలుష్యం 10 నుంచి 11 డెసిబుల్స్‌ తగ్గింది. 

నగరమంతటా ఇదే పరిస్థితి 

తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో  69 డెసిబుల్స్‌గా ఉన్న  శబ్దకాలుష్యం ఒకే సారి 59 నుంచి 58 డెసిబుల్స్‌కు పడిపోయింది. నగరమంతటా ఇదే పరిస్థితి. శబ ్దకాలుష్యం రికార్డు స్థాయిలో తగ్గడం వల్ల ఎన్‌జీఆర్‌ఐలోని రిక్టర్‌ స్కేల్‌పై స్వల్ప భూప్రకంపనలు కూడా రికార్డవుతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఆంత్రోపొజెనిక్‌, హ్యూమన్‌ కాజ్డ్‌ సెస్మిక్‌ నాయిస్‌ తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్‌లో 2.5 మ్యాగ్నిట్యూడ్‌లో కూడా ప్రకంపనలు రికార్డు కావడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం 1.5 మ్యాగ్నిట్యూడ్‌ స్థాయిలోని సూక్ష్మమైన ప్రకంపనలు రికార్డవుతున్నవి. ఉదాహరణకు హైదరాబాద్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేట పులిచింతలలో ఇటీవల భూ ప్రకంపనలు వచ్చాయి. అవి స్వల్పస్థాయిలో తరచూ కొనసాగుతున్నాయి. అక్కడ 2.5 మ్యాగ్నిట్యూడ్‌ కంటే ఎక్కువ వచ్చిన ప్రకంపనలే హైదరాబాద్‌ ఎన్‌జీఆర్‌ఐ కేంద్రంలో నమోదయ్యాయి. కానీ గత కొన్ని రోజులుగా అక్కడ 2 మ్యాగ్నిట్యూడ్‌ల లోపు సంభవిస్తున్న ప్రకంపనలు ఎన్‌జీఆర్‌ఐ కేంద్ర కార్యాలయంలోని రిక్టర్‌ స్కేల్‌పై  స్పష్టంగా నమోదవుతున్నాయి. 

పరిశోధనలకు మంచి సమయం

లాక్‌డౌన్‌ కారణంగా శబ్ద కాలుష్యం దాదాపు నాలుగు రెట్లు తగ్గడం వల్ల 300 కిలోమీటర్ల పరిధిలోని భూ ప్రకంపనలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. 50 ఏండ్ల తర్వాత ఈ పరిస్థితిని చూస్తున్నాం. సాధారణంగా  హైదరాబాద్‌లో 1.5 మ్యాగ్నిట్యూడ్‌పైన ప్రకంపనలు ఉంటేనే  రిక్టర్‌ స్కేల్‌పైన నమోదవుతుంది. కానీ ఇప్పడు గతంలో మాదిరిగా స్వల్ప ప్రకంపనలు కూడా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఎంత తీవ్రత ఉంటే రిక్టర్‌ స్కేల్‌పై భూ ప్రకంపనలు నమోదయ్యాయి...? ఆ తర్వాత ఎంత మార్పు వచ్చిందనే దానిపై పరిశీలన జరిపాం. ఇక పై ఎంత తీవ్రతతో నమోదైతే ఎంత లెక్క తీసుకోవాలనే అంచనాకు రాగలుగుతున్నాం. హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యం వల్ల స్వల్ప ప్రకంపనలు సరిగ్గా నమోదు కాకపోవడం వల్ల మేము చౌటుప్పల్‌తో పాటు పలు చోట్ల ఎన్‌జీఆర్‌ఐ కేంద్రాలను నెలకొల్పాం. లాక్‌డౌన్‌లో మారిన పరిస్థితులు సరికొత్త అంచనాలకు దోహదపడుతున్నాయి.      

- శ్రీనగేశ్‌, ఎన్‌జీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్ట్‌ 


logo