మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 17, 2020 , 23:23:43

కరోనాపై పక్కా ప్రణాళిక

కరోనాపై పక్కా ప్రణాళిక

  • ప్రైమరీ, ఫస్ట్‌, సెకండ్‌ స్టేజ్‌ 
  • కాంటాక్ట్‌ల వారీగా జాబితా రెడీ..
  • పకడ్బందీ ప్రణాళికతో ముందుకు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సైబరాబాద్‌ పోలీసులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రైమరీ, ఫస్ట్‌, సెకండ్‌ స్టేజ్‌ల వారీగా కరోనా అనుమానితుల జాబితాను తయారు చేశారు. ఏ క్షణమైనా వీరిలో పాజిటివ్‌ అని తేలితే.. వెంటనే వారితో కాంటాక్ట్‌ అయిన వారి జాబితాను రెడీగా ఉంచడంతోపాటు.. అందర్నీ క్వారంటైన్‌లోకి పంపేందుకు వివరాలను సేకరించారు. మార్చి 22 నుంచి అధికారికంగా వస్తున్న జాబితాను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రత్యేక బృందమైన ఎస్‌ఓటీకి అప్పగిస్తున్నారు. వారు కేంద్ర నిఘా వర్గాలు, స్థానిక నిఘా వర్గాల ద్వారా పలు అనుమానితుల సమాచారాన్ని తీసుకుంటున్నారు. ప్రైమరీగా సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌ జోన్‌లో 30, బాలానగర్‌  జోన్‌లో 25, శంషాబాద్‌ జోన్‌లో 9 మంది కరోనా బారినపడి వారు చికిత్స పొందుతున్నారు. ఇందులో పలువురు మరణించగా మిగతా సభ్యుల్లో దాదాపు 25 శాతం పైగా డిశ్చార్జి అయ్యారు. ఇంకా కొంత మంది చికిత్స పొందుతున్నారు. వీరి వివరాలు సేకరించుకున్న ఎస్‌ఓటీ బృందం ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలను విశ్లేషించి పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రైమరీ కాంటాక్ట్‌వారు ఎవర్నీ కలిశారనే దానిపై సెకండ్‌ స్టేజ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ను తయారు చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రైమరీ నుంచి ఫస్ట్‌ స్టేజీలో ఉన్నవారు ఎవరూ కరోనా బారిన పడినవారు లేరని తెలుస్తుంది. అకస్మాత్తుగా ఎవరైనా కరోనా బారిన పడినా.. ఇప్పుడు పోలీసుల వద్ద ఫస్ట్‌ స్టేజీలో ఉన్నవారు ఎవరెవరిని కలిశారనే చిట్టా రెడీగా ఉండడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే ఫస్ట్‌ స్టేజీ కాంటాక్ట్‌ల వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు అందించడంతో వారంతా ఇప్పుడు వారిని తమ పరిశీలనలో పెట్టుకుని వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరి పీల్చుకున్నట్లు తెలిసింది. ఈ విధంగా పోలీసులు కరోనాను కూడా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ తరహాలో దర్యాప్తు చేసి.. అది వ్యాప్తి చెందకుండా మూడు అంచెల వ్యూహాత్మక కంచెను వేశారు. 


logo