శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 17, 2020 , 23:22:27

బయటికొస్తే.. క్రిమినల్‌ కేసులే

బయటికొస్తే.. క్రిమినల్‌ కేసులే

  • అనవసరంగా తిరుగుతున్నారు
  • పాసులను దుర్వినియోగపరుస్తున్నారు
  • కొంతమంది కలర్‌ జిరాక్స్‌లు చూపించి మోసం చేస్తున్నారు 
  • ట్యాంక్‌బండ్‌పై నిమిషానికి 60 వాహనాల రాకపోకలు
  • మామూలు రోజుల్లాగే రద్దీ ఉంటే కట్టడికి అర్థముందా?
  • కంటైన్‌మెంట్‌ కేంద్రాలను 143కు పెంచాం
  • వ్యాధి వ్యాప్తి తీరు ఆందోళనకరం
  • ఒకరి నుంచి 20 మందికి.. ఆరుగురి నుంచి 81 మందికి వ్యాప్తి 
  • జాగ్రత్తగా ఉండండి
  • నగర వాసులకు సూచించిన నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజలు సైతం అనవసరంగా రోడ్లపై తిరుగుతూ సమస్యలు సృష్టిస్తున్నారని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఆదివారం జరిగే మంత్రి మండలి సమావేశం సందర్భంగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్‌ విలేకరులతో మాట్లాడుతూ, నియంత్రిత జోన్‌లో ఉన్నవారు తమ ఉద్యోగాల గుర్తింపు కార్డులు, పోలీసు శాఖ పాసులు చూపిస్తూ బయటకు వెళ్తున్నారని, ఇలా చేయడం వల్ల క్వారంటైన్‌ ఉద్దేశం నీరుగారుతున్నదన్నారు. తాను ట్యాంక్‌బండ్‌ వద్ద ఒక నిమిషం ట్రాఫిక్‌ను పరిశీలించగా, 60 సెకన్లలో 60 వాహనాలు  ఆ మార్గం మీదుగా వెళ్లినట్లు పేర్కొంటూ, మామూలు రోజుల్లో మాదిరిగానే ప్రజలు బయట తిరుగుతున్నారన్నారు. అత్యవసర విధుల కోసం ఇస్తున్న పాసులను దుర్వినియోగం చేయరాదని సూచించారు. కొందరు పాసులను కలర్‌ జిరాక్స్‌లు తీయించి ఇతరులకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

28 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి..

14రోజుల క్వారంటైన్‌ గడువు పూర్తయ్యాక కూడా కొందరికి పాజిటివ్‌ వచ్చినట్లు మేయర్‌ తెలిపారు. అందుకే ఇప్పుడు 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన తరువాత మరో 14 రోజులు బఫర్‌లో ఉండాలని సూచిస్తున్నామన్నారు. అంటే మరో 14రోజులపాటు  కుటుంబ సభ్యులతో దూరం పాటించాలని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులను దూరంగా ఉంచాలని సూచించారు. ప్రస్తుతం నియంత్రిత జోన్ల సంఖ్య 143కు పెరిగిందన్నారు. అక్కడ రోజుకు రెండుసార్లు జ్వరం పరీక్షలు నిర్వహించడంతో పాటు క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. 

ఒకరి నుంచి 20 మందికి... 

వ్యాధి తీవ్రత అధికంగా ఉందని మేయర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌లో ఒక ఉల్లిగడ్డల వ్యాపారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అతని ద్వారా అతని భార్యకు సోకిందన్నారు. అతని వద్ద ఉల్లిగడ్డలు కొనుగోలు చేసిన, ఆతడిని సంప్రదించిన సుమారు 40 మందిని ఐసోలేషన్‌ చేసినట్లు మేయర్‌ చెప్పారు. తలాబ్‌కట్టలో ఒకే ఇంట్లో ఒకరి నుంచి 20 మందికి వ్యాధి సోకిందన్నారు. ఆరుగురు మర్కజ్‌ యాత్రికుల నుంచి 81 మందికి వ్యాప్తి చెందినట్లు చెప్పారు. ఇటీవల షాద్‌నగర్‌లో ఒక వృద్ధురాలు కరోనాతో చనిపోయిందని,  ఆమెకు మర్కజ్‌ యాత్రికులు ప్రయాణించిన రైలులో ఒక వ్యక్తి ద్వారా కరోనా సోకినట్లు వెల్లడైందన్నారు. సూర్యాపేటలో ఒక వ్యక్తి ద్వారా 11మందికి, వారి నుంచి మరో 111 మందికి వ్యాధి సోకినట్లు తేలిందన్నారు. ఇందులో పలువురు నగరానికి వచ్చినట్లు సమాచారం ఉందన్నారు. అందుకే వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాల ప్యాకెట్లు ఉప్పు నీటిలో కనీసం గంటపాటు ఉంచిన తరువాత మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లాలన్నారు. ఢిల్లీలో ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తికి పాజిటివ్‌ సోకగా, అతడు సంప్రదించిన 80 మందిని క్వారంటైన్‌ చేసినట్లు పేర్కొంటూ,  ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండడమే కాకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని సూచించారు.  

అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్ట్‌ 

కూరగాయలు, నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మేవారిపై పీడీ యాక్టు బుక్‌ చేస్తామని హెచ్చరిస్తూ, ఇలా ఎక్కడైనా జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. నియంత్రిత ప్రాంతాల్లో దుకాణదారులు, సూపర్‌ మార్కెట్ల నిర్వాహకులు సామాజిక దూరంతో పాటు పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో వారి దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 350 మొబైల్‌ రైతు బజార్ల ద్వారా కూరగాయలను సరఫరా చేస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారిని ఫీజుల కోసం నిర్వాహకులు ఇబ్బంది పెట్టరాదని కోరారు. రోజూ దాతల ద్వారా 25వేల ఆహార పొట్లాలు వస్తున్నట్లు, వాటిని ప్రతి జోన్‌లో రెండు చొప్పున మొబైల్‌ వాహనాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్లు వలస కూలీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు, వారికి రెండో దఫా బియ్యం పంపిణీ చేస్తామన్నారు.


logo