బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 17, 2020 , 09:22:20

పేదల కోసం..పెద్ద మనసు

పేదల కోసం..పెద్ద మనసు

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ: పేదల కోసం ఓ కుటుంబం పెద్ద మనుసు చేసుకొని నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.చైతన్యపురి డివిజన్‌ మున్సిపల్‌ కాలనీకి చెందిన జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి గనుపేట నరేశ్‌ తన తండ్రి జంగయ్య జలమండలి వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్‌ కాగా తల్లి శకుంతల జీహెచ్‌ఎంసీ కామాటిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యింది. తల్లిదండ్రులు తమ పెన్షన్‌ నుంచి చెరో పది వేలు అందించగా, నరేశ్‌ పదివేలు, నరేశ్‌ అన్న  తెలంగాణ విద్యాశాఖ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ అటెండర్‌గా పనిచేసే సుధాకర్‌ రూ. 10 వేలు, ప్రైవేటు ఉద్యోగం చేసే మరో అన్న సురేశ్‌ రూ. 10 వేలు అందించగా మొత్తం రూ.50 వేలతో బస్తీలో సుమారు 150 కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి సరుకులు పంపిణీ చేశారు.   

కానిస్టేబుల్‌ ఉదారత 

చార్మినార్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌ తన జీతం డబ్బులతో రోగుల బంధువుల ఆకలి తీరుస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు.  పాతబస్తీలోని పోలీస్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే అరుణ్‌కుమార్‌ తన జీతంలో నుంచి కొంత మొత్తాన్ని వెచ్చించి సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రసూతీ దవాఖానలో రోగుల బంధువుల ఆకలి తీరుస్తున్నాడు. అందులో భాగంగా పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతీ దవాఖానతో పాటు ఆ పరిసరాలలో ఉన్న సుమారు 800 మంది పేదలకు గురువారం అల్పాహారం అందించారు. అలాగే మరో మూడు రోజుల పాటు పేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తానని అరుణ్‌ పేర్కొన్నాడు. అరుణ్‌కుమార్‌ సేవలను గుర్తించిన పోలీస్‌ ఉన్నతాధికారులు అతన్ని అభినందించారు.

శభాష్‌.. ఎండీ.రషీద్‌ 

నేరేడ్‌మెట్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావొద్దంటూ వినాయక్‌నగర్‌కు చెందిన ఎండీ. హెచ్‌. రషీద్‌ సైకిల్‌కు ఇండియన్‌ ఫ్లాగ్‌, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే హన్మంతరావు, కరోనా వైరస్‌ నివారణ చిత్రాలను సైకిల్‌కు అమర్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ సందర్భంగా ఎండీ రషీద్‌ను నేరేడ్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.నర్సింహస్వామి అభినందించారు.

అమ్మమ్మ అంత్యక్రియలకు దూరంగా...

చందానగర్‌, నమస్తే తెలంగాణ: లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అమ్మమ్మ అంత్యక్రియలకు దూరంగా ఉంటూ విధి నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చాడు ఓ కానిస్టేబుల్‌. చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ పడాల శివగణేశ్‌ (పీసీ 3740) అమ్మమ్మది తూర్పుగోదావరి జిల్లాలోని వీరవరం గ్రామం. కాగా ఈనెల 8న శివగణేశ్‌ అమ్మమ్మ అప్పాయమ్మ మృతి చెందింది. ఐతే తన తల్లిని తీసుకుని కుటుంబ సభ్యులతో అంత్యక్రియలకు వెళ్లాల్సిన శివగణేశ్‌ తన తల్లిని ఓదార్చి, నచ్చచెప్పి విధినిర్వహణలో భాగంగా వచ్చే పరిస్థితి లేదని అక్కడి బంధువులకు సమాచారం ఇచ్చారు. వీడియో కాల్‌లో అప్పాయమ్మ ఆకరి చూపు చూసి శివగణేశ్‌ కుటుంబం బాధను దిగమింగుకుంది.


logo