బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 17, 2020 , 09:21:25

ఒక్క కేసు నమోదైనా..నియంత్రణే

ఒక్క కేసు నమోదైనా..నియంత్రణే

  • పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు కంటైన్మెంట్‌ పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తెలిపారు. ఒక పాజిటివ్‌ కేసు గుర్తించిన ప్రాంతాన్ని కూడా కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రభుత్వం ప్రకటిస్తున్నందున అందుకు అనుగుణంగా బారికేడింగ్‌, ఇతర చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు.  గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అర్వింద్‌ కుమార్‌ కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంటైన్మెంట్‌  జోన్లలో సర్వెలెన్స్‌ టీమ్‌లు నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వే, వ్యాధి అనుమానిత వ్యక్తులకు ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకు న్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో సిబ్బందికి అరోగ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ప్రతిరోజూ పర్యవేక్షించాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్లలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు, సర్వెలెన్స్‌ టీమ్‌లు, క్రిమి సంహారక మందులు స్ప్రే చేస్తున్న బృందాలకు రక్షణ పరికరాలను అందజేసినట్లు ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు.  ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించడంతోపాటు కరోనా వైరస్‌ నివారణకు సహకరించాలని, ఇండ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు, ఈ మేరకు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాలను మూడు భాషల్లో రికార్డు చేయించి ఆటోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ వివరించారు. జీహెచ్‌ఎంసీ వైద్య విభాగం అదనపు కమిషనర్‌ సంతోష్‌, నగర ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo