బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 17, 2020 , 09:19:09

గ్రేటర్‌లో 32 కేసులు

గ్రేటర్‌లో 32 కేసులు

 • నియంత్రిత ప్రాంతాలను సందర్శించిన అధికారులు 
 • కలిసి కట్టుగా కరోనాను తరిమేద్దాం
 • మంత్రి తలసాని పిలుపు 

సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఊపిరిపీల్చుకున్న ఒక రోజు కూడా గడవక ముందే మరోసారి కొవిడ్‌  పడగ విప్పింది.  హైదరాబాద్‌ జిల్లాలోనే గురువారం 32 కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా ఎక్కువగా పాతబస్తీ దక్షిణ మండలం పరిధిలోని రామ్‌నాస్‌పురా, బహుదూర్‌పురా, కిషన్‌బాగ్‌, పహాడి పరిసర ప్రాంతాలు, పశ్చిమ మండలం పరిధిలోని ఆగాపురా, నాంపల్లి, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నాంపల్లి ఆగాపురాలోని ఓ యూనాని వైద్యుడితో సహా అతడి కుటుంబంలోనే ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇలా ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి పాజిటివ్‌ వచ్చిన కేసులు పాతబస్తీలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

 • నల్లకుంటలోని ఫీవర్‌ దవాఖానలో గురువారం 16 అనుమానిత కరోనా కేసులు నమోదయ్యాయి. 
 • పాత మలక్‌పేట డివిజన్‌ ఫకీర్‌ గల్లీకి చెందిన ఓ కుటుంబంలో 11 మందికి కరోనా పాజిటివ్‌ రాగా వారిలో ఓ మహిళ పూర్తిగా కోలుకొని ఇంటికి చేరింది. బుధవారం ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా, నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశారు. 
 • అంబర్‌పేట సర్కిల్‌, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ సీఈ కాలనీ(గంగాబౌళి)లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంట్లో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం బాలికకు పాజిటివ్‌ రావడంతో గాంధీకి తరలించిన విషయం తెలిసిందే. గురువారం అదే ఇంటికి చెందిన ఆరేండ్ల బాలుడికి కూడా  వైరస్‌ సోకింది. దీంతో ఒకే ఇంట్లో నాలుగో కేసు నమోదైంది.  
 • బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పీఅండ్‌టీకాలనీలో నివాసముండే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన కొడుకు, కూతురుకు పాజిటివ్‌ రావడంతో అధికారులు వారిని సైతం గాంధీకి తరలించారు. 
 • ముషీరాబాద్‌లోని కృష్ణకాలనీ సమీపంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు  ఆమెతో సన్నిహితంగా ఉండే మరో 18 మందిని వైద్య పరీక్షల కోసం వైద్యశాలకు తరలించారు. 

మంత్రి తలసాని టెలి కాన్ఫరెన్స్‌

బేగంపేట: కలిసి కట్టుగా కరోనాను తరిమేద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. నల్లగుట్ట వాసులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన   వారి సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. గురువారం మాసబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి స్థానిక కార్పొరేటర్‌ అరుణతో ఈ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘మన నల్లగుట్ట ప్రాంతంలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిం ది కదా.. అందుకే ఈ ప్రాంతంలో రెడ్‌ జోన్‌ పెట్టాం. మరి కొద్ది రోజులు సహకరించండి. త్వరలోనే అంతా సర్దుకుంటుంది.  ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.’ అని నల్లగుట్టవాసుల్లో ధైర్యాన్ని నింపారు. ఈ ప్రాంతంలో రెం డు రోజులకు ఒకసారి స్ప్రే చేయాలని, ప్రజల అవసరాలను గుర్తించి వారికి తగి న ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ విభాగాల అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీసీ ముకుంద్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ డైరెక్టర్‌ విశ్వజీత్‌, నల్లగుట్ట ఏరియా ఇన్‌చార్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

 • చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దోమలగూడ బాదాం గల్లీలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పర్యటించారు. పోలీసులు తీసుకున్న చర్యలను పర్యవేక్షించి చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకర్‌ను మేయర్‌ అభినందించారు. 
 • జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ఉన్న నియంత్రిత ప్రాంతాలను సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ కె. రవికుమార్‌, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌, గోపాలపురం  ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. 
 • నియంత్రిత ప్రాంతాల్లో  సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పర్యటించారు. భద్రతా చర్యలను అడిగి తెలుసుకున్నారు. 
 • కరోనా ప్రభావిత ప్రాంతాలైన చంద్రగిరి కాలనీ, హస్మత్‌పేట్‌ తదితర ఏరియాలను కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, బాలనగర్‌ బీసీపీ పద్మజతో కలిసి మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సందర్శించారు. స్థానిక అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. 
 • అంబర్‌పేట సర్కిల్‌లోని నియంత్రిత ప్రాంతాలైన సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీ, రామకృష్ణనగర్‌ కాలనీ, న్యూనల్లకుంట, కింగ్‌కోఠిలను జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌(సికింద్రాబాద్‌) కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలాజీ, ఏఎంఓహెచ్‌ డా.వై.హేమలత, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమ తదితరులు ఉన్నారు.  
 •   కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శంకరయ్య ఆధ్వర్యంలో నియంత్రిత ప్రాంతాలైన అపురూపకాలనీ, మోడీ బిల్డర్స్‌ల్లో కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ ఎం.మంగతాయారు సందర్శించారు. 10 మంది కరోనా అనుమానితులకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, వారిని ఇండ్లలో స్వీయ నియంత్రణలో ఉంచామన్నారు. 

క్వారంటైన్‌కు  విదేశీయులు

అమీర్‌పేట్‌: ఎర్రగడ్డలో చైనా యువతులు పట్టుపడ్డారు. చైనాకు చెందిన యువతి, యువకుడు, నాగాల్యాండ్‌కు చెందిన మరో యువతి కారులో కూకట్‌పల్లి వైపు వెళ్తూ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌  చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసుల తనిఖీలో బయటపడ్డారు. వీరంతా అమీర్‌పేట్‌ నుంచి కూకట్‌పల్లికి వెళ్తున్నట్లు తెలిసింది. కూకట్‌పల్లిలోని లోథా అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటూ ఇక్కడ చదువుకుంటున్నారు. సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి వీరి గురించి విచారణ జరుపుతున్నారు. ముందుగా వైద్య పరీక్షల కోసం క్వారంటైన్‌కు పంపించారు. 


logo