శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 16, 2020 , 00:43:47

అందుబాటులోకి ‘కొశాక్‌'

అందుబాటులోకి ‘కొశాక్‌'

  • ఇకపై నిస్సంకోచంగా కరోనా రోగికి పరీక్షలు  

అమీర్‌పేట్‌, నమస్తే తెలంగాణ: కరోనా రోగికి పరీక్షలు నిర్వహించే వైద్యులకు శుభవార్త. రోగికి పరీక్షలు నిర్వహించే సమయంలో వారు తుమ్మినా, దగ్గినా వారి నుంచి వ్యాధి అంటుకోకుండా ఉండేందుకు సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాల డీన్‌ సూచనల మేరకు వైద్యులు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు కరోనా రోగికి పరీక్షలు చేసే వైద్యులు నిరభ్యంతరంగా చేసేందుకు వీలుగా కొశాక్‌ (కొవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ కియోస్క్‌)ను అందుబాటులోకి తెచ్చారు. బుధవారం సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలలో కొశాక్‌ పనిచేసే తీరును డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జేఆర్‌ జోషి కళాశాల డీన్‌ ఎం.శ్రీనివాస్‌కు వివరించారు.  

వైద్యుడు బయట..రోగి లోపల..

కరోనా రోగి సౌకర్యవంతంగా నిలుచుని ఉండే విధంగా ఆరున్నర అడుగుల ఎత్తు. రెండున్నర అడుగుల వెడల్పుతో కొశాక్‌ చాంబర్‌ను తీర్చిదిద్దారు. ఈ చాంబర్‌కు ముందు వైపు ఉండే రెండు రంద్రాలకు చేతి గ్లౌజులు అమర్చి ఉంటాయి. ఈ గ్లౌజులను వినియోగిస్తూ చాంబర్‌లోపల ఉండే వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో బయట ఉండి వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుడికి లోపల ఉండే వ్యక్తి నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ విధానం వల్ల వైద్యులు మరింత స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించే వీలుంది. 

2 నిమిషాలకో రోగిని పరీక్షించొచ్చు.. 

కొశాక్‌ చాంబర్‌ ద్వారా జరిగే పరీక్షల్లో ఒక్కో వ్యక్తికి కేవలం 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోదని డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జోషి ఈఎస్‌ఐ డీన్‌కు వివరించారు. వైద్య పరీక్ష కేవలం 10 సెకండ్లలో ముగుస్తుందని, పరీక్ష పూర్తయిన వెంటనే 30 సెకండ్ల పాటు చాంబర్‌కు కెమికల్‌ను చిమ్ముతారు. ఆ వెంటనే 40 సెకండ్ల పాటు మంచినీటితో మరోసారి శుభ్రం చేయడం ద్వారా మరో వ్యక్తిని పరీక్షించేందుకు వీలుంటుంది. ఈఎస్‌ఐసీకి అందజేసిన రెండు చాంబర్ల ద్వారా రెండు షిఫ్టుల పద్ధతిలో వైద్య పరీక్షలు జరిగినా ఒక్క రోజులో కనీసం వెయ్యి మందికి తక్కువ కాకుండా పరీక్షలు చేయవచ్చని డాక్టర్‌ జోషి వివరించారు. కొశాక్‌ చాంబర్లు కావాలంటూ వివిధ ప్రభుత్వ దవాఖానల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని, వీటిని అందజేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. 


logo