శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 16, 2020 , 00:39:11

గ్రేటర్‌లో కరోనా తగ్గుముఖం

గ్రేటర్‌లో కరోనా తగ్గుముఖం

  • హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను హాట్‌స్పాట్‌గా ప్రకటించిన కేంద్రం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌వాసులను నిన్నటివరకు వణికించిన కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య బుధవారం తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఒక్కరోజే గ్రేటర్‌లో 33 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంలో అందులో పాతబస్తీలోని ఒకే కుటుంబంలో 17మంది బాధితులు ఉండడం కలకలం రేపి న విషయం తెలిసిందే. మంగళవారం నాటికి గ్రేటర్‌లో మొత్తం 249 కేసులు నమోదవగా బుధవారం 267గా నమోదయ్యాయి. అయితే మొన్నటి వరకు గ్రేటర్‌లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు సంబంధించిన పాజిటివ్‌ కేసులను జీహెచ్‌ఎంసీలో కాకుండా సంబంధిత జిల్లా మొత్తం కేసుల్లో ప్రకటించారు. కానీ బుధవారం నాటి కేసుల్లో మాత్రం రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని జీహెచ్‌ఎంసీ పరిధిల్లోని పాజిటివ్‌ కేసులను మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో కలుపడంతో బుధవారం నాటి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.  

మూడు జిల్లాలు హాట్‌స్పాట్ల పరిధిలోకే...

పాజిటివ్‌ కేసుల తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం  హాట్‌స్పాట్‌ జిల్లాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు కూడా ఉండడంతో ఈ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఒకే కుటుంబంలో నలుగురికి... 

మాదాపూర్‌:  మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్‌ వీకర్‌సెక్షన్‌ కాలనీలోని ఓ కుటుంబంలో నలుగురికి కరోనా వ్యాప్తి చెందడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి రాకపోకలను నిలిపివేశారు.   

  • బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ సీఈ కాలనీలో ఓ ఐదేండ్ల బాలికకు కరోనా వచ్చింది. బుధవారం అధికారులు సీఈ కాలనీలో పరిస్థితిని సమీక్షించారు.
  • నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ సాబేర్‌నగర్‌ నుంచి 13 మందిని, మూసారాంబాగ్‌లోని హెగ్డే దవాఖాన సమీపంలోని ఓ హోటల్‌లో పనిచేసే వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు.
  • ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలో 52 మంది అనుమానితులు, నల్లకుంట ఫీవర్‌ దవాఖానలో 17 మంది చేరారు.
  • బ్యాంకు మూసివేత
  • చాంద్రాయణగుట్ట : బార్కాస్‌ ఎస్‌బీఐ పక్కన నివసించే ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో జనం ఆందోళన చెందారు. బ్యాంకు పక్కనే పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వ్యక్తి నివసిస్తున్నాడని తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. వెంటనే బ్యాంకు లావాదేవీలను నిలిపివేస్తూ బ్యాంకును మూసివేయాలని కోరారు.


logo