గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 16, 2020 , 00:32:56

కట్టుదిట్టంగా..

కట్టుదిట్టంగా..

  • ఎవరూ బయటకు రాకుండా చర్యలు 
  • 24 గంటల పహారా
  • సేఫ్‌ జోన్లుగా నియంత్రిత ప్రాంతాలు 

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కంటిమీదకునుకు లేకుండా పనిచేస్తున్నారు. వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా నియంత్రిత ప్రాంతాల్లో కొవిడ్‌-19 కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకే ఒక ప్రవేశమార్గం ఏర్పాటు చేసి.. అన్ని రహదారులను మూసివేశారు. ఏ ఒక్కరూ బయటకు రాకుండా లోపలికి వెళ్లకుండా 24 గంటలు నిఘా పెట్టారు. ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. మొత్తంగా ఈ ఏరియాలను పూర్తిగా సేఫ్‌ జోన్‌లుగా మార్చేస్తున్నారు. 

ఇతర శాఖల సమన్వయంతో... 

యుద్ధభూమిలో సైనికుడిలా కరోనాపై పోలీసులు పోరాడుతున్నారు. ఇతర శాఖల సమన్వయంతో వైరస్‌ అంతం కోసం పాటుపడుతున్నారు. ప్రజలంతా తప్పనిసరిగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించేలా నిరంతరం పహారా కాస్తున్నారు. ఎవరూ రూల్స్‌ ఉల్లంఘించకుండా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తున్నారు. అష్టదిగ్బంధం ద్వారా మహమ్మారి ప్రభలకుండా చేస్తున్నారు. అన్ని దారులను మూసివేసి.. అధికారుల రాకపోకల కోసం ఒక్క రోడ్డునే తెరిచి ఉంచుతున్నారు. అలాగే డాక్టర్లు, జీహెచ్‌ఎంసీ , రెవెన్యూ అధికారులు కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటితో పాటూ చుట్టుపక్కన ఉన్న వారి గృహాలను పర్యవేక్షిస్తున్నారు.  

24/7 పర్యవేక్షణ 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా నియంత్రిత ప్రదేశంలో 24/7 గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ  వైద్య పరీక్షలు చేస్తున్నారు. బల్దియా, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. పోలీసులు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎవరూ నిబంధనలను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ బయటికి రాకుండా, లోనికి వెళ్లకుండా నిఘా పెట్టారు. ఈ ఏరియాల్లో  టీం కెప్టెన్‌గా ఆయా జోన్‌ డీసీపీలు పక్కా ప్రణాళికతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని ప్రాంతాలను సురక్షితంగా మార్చేస్తున్నారు. సిబ్బందికి పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌లను అందిస్తున్నారు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

అన్ని శాఖల  సమన్వయంతో కొవిడ్‌ను ఎదుర్కొంటున్నాం. కంటైన్మెంట్‌ ఏరియాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాం. ఆయా ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేశాం.  జీహెచ్‌ఎంసీ ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలను సరఫరా చేస్తుంది. ఏ ఒక్కరూ  బయటకు రావొద్దు. నిత్యావసరాల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని సవ్యంగా ఉన్నాయి.  వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి నిత్యావసర సరుకులు, భోజన వసతిని జీహెచ్‌ఎంసీ కల్పిస్తుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

-అంజనీకుమార్‌, హైదరాబాద్‌ సీపీ  

ఆత్మైస్థెర్యం నింపుతున్నాం 

మా జోన్‌లో మొత్తం 14 కంటైన్మెంట్‌ ప్రాంతాలున్నాయి. అల్వాల్‌-హస్మత్‌పేట్‌, రాజీవ్‌గాంధీ నగర్‌, అంజనాపురికాలనీ, జానకీకాలనీ, శామీర్‌పేట్‌-తుర్కపల్లి, జగద్గిరిగుట్ట-చంద్రగిరికాలనీ, ఎల్లమ్మబండ, జీడిమెట్ల-అపురూపకాలనీ, సుభాష్‌నగర్‌, కళావతినగర్‌, మోడీ అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌-డిలు ఉన్నాయి. కరోనా పాజిటివ్‌ ఉన్న వారితో పాటు వందల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధం. ఐదు కుటుంబాల్లో 24  పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో చాలా మంది ఆరోగ్యవంతంగా బయటపడ్డారు. అందరిలో ఆత్మైస్థెర్యం నింపుతున్నాం. 

-పద్మజ, డీసీపీ బాలానగర్‌ జోన్‌

రాకపోకలు  నిషేధం 

మా జోన్‌ పరిధిలో మొత్తం 16 కంటైన్మెంట్‌ ప్రాంతాలున్నాయి.  సుమారు 30 మంది పాజిటివ్‌ కేసుల వారు ఉన్నారు.  ఓ ఏరియాలో పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటితో పాటు దాదాపు 100 ఇండ్లు ఉన్నాయి. నియంత్రిత ప్రాంతాలైన అయ్యప్ప సొసైటీ, ఇజ్జత్‌నగర్‌, అంజయ్యనగర్‌, అరెంజ్‌ కౌంటీ, రాజ్‌పుష్పా అపార్ట్‌మెంట్‌, హాల్‌మార్క్‌ ట్రాంకిల్‌, బాలాజీనగర్‌-కూకట్‌పల్లి, భగత్‌సింగ్‌నగర్‌-కేపీహెచ్‌బీ, పీవీఆర్‌ రెసిడెన్సీ-కేపీహెచ్‌బీ, మయూరీనగర్‌ ఆర్‌సీపురం, అంబేద్కర్‌నగర్‌, సాయినగర్‌ హాఫీజ్‌పేట్‌, మైత్రీనగర్‌-మదీనాగూడ, సితార హోటల్‌ అపర్ణ హిల్‌ మార్క్‌లో అత్యవసర వైద్య సేవల కోసం ఓ అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాం. 

-వెంకటేశ్వరరావు, డీసీపీ మాదాపూర్‌

భయాందోళన వద్దు  

మా పరిధిలో రెండు కంటైన్మెంట్‌ జోన్‌లు ఉన్నాయి. నాచారం రాఘవేంద్ర కాలనీ, మల్కాజిగిరిలోని షఫీనగర్‌, షాదుల్లానగర్‌లు ఉన్నాయి. మూడు కుటుంబాలు కరోనా బారినపడ్డాయి. వారిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరూ భయాందోళనలు గురికావొద్దు. 

-రక్షిత కే మూర్తి, డీసీపీ మల్కాజిగిరి

మినహాయింపులు లేవు 

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ఎవరికీ మినహాయింపులు లేవు. మా జోన్‌ పరిధిలో మొత్తం 9 నియంత్రిత ప్రాంతాలు ఉన్నాయి. నందిగామ ఒకటి, బండ్లగూడ కార్పొరేషన్‌లో ఒకటి, మిగతా 7 ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. మా దగ్గర మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

-ప్రకాశ్‌రెడ్డి, డీసీపీ శంషాబాద్‌ జోన్‌

ఎనిమిది అడుగుల ఎత్తులో..

మా పరిధిలో మొత్తం 9 నియంత్రిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిని 8 అడుగుల ఎత్తులో బ్యారికేడింగ్‌ చేశాం. మొత్తం 14 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో ఇద్దరు ఆరోగ్యవంతంగా బయటపడ్డారు. మరో 12 మంది వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఎవరికీ ప్రవేశానికి, బయటికి వెళ్లడానికి అనుమతి లేదు. శాంతి భద్రతల సమస్య ఉత్పనం రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తున్నాం. నిత్యావసర సరుకులు, కూరగాయాలు, మందులు కావాలన్నా అందుబాటులోకి తెస్తున్నాం. 

-సన్‌ప్రీత్‌ సింగ్‌, డీసీపీ ఎల్బీనగర్‌ 


logo