బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 14, 2020 , 23:56:43

తలుపు తట్టి..సరుకులిచ్చి

తలుపు తట్టి..సరుకులిచ్చి

  • గొప్ప మనసు చాటుకుంటున్న దాతలు 
  • నిరంతరాయంగా నిత్యావసర సరుకుల పంపిణీ
  • 23,728 క్వింటాళ్ల బియ్యం, 2059 క్వింటాళ్ల పప్పు అందజేత  
  • ఆరు లక్షల కుటుంబాలకు లబ్ధి 

కష్టకాలంలో మేమున్నామంటూ.. తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు దాతలు.  ఆపదలో ఆపద్బంధవులుగా ఖర్చులకు వెనుకాడకుండా.. ఇంటికే వచ్చి సరుకులు అందజేస్తూ...ఆదర్శంగా నిలుస్తున్నారు.  వలస కూలీలకు ఆపత్కాలంలో అండగా ఉంటున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని నియోజకవర్గంలో నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు సుమారు 23, 728 క్వింటాళ్ల బియ్యం, 2059 క్వింటాళ్ల పప్పును అందించగా,  సుమారు ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరింది.  ఇక డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక్కొక్కరూ 10వేల మందిని ఆదుకోవడమే లక్ష్యంగా నిత్యావసరాలను అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్లు  సైతం తమకు తోచినంత  సాయం చేస్తున్నాయి. 

ఆపదలో ఆదుకుంటున్నారు... 

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో సుమారు బియ్యం 820 క్వింటాళ్లు, పప్పులు సుమారు 10 క్వింటాళ్లు,  సుమారు 80 క్వింటాళ్ల్ల కూరగాయలు   అందించారు.  ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుమారు 100 క్వింటాళ్ల బియ్యం, కూరగాయలు , నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి నేమి ఫౌండేషన్‌ ద్వారా సుమారు 500 క్వింటాళ్ల బియ్యంతో పాటు సుమారు 500 కేజీల పప్పులు, కూరగాయలు, మంచినూనె తదితర సరుకులను పంపిణీ చేస్తున్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి సుమారు 50 క్వింటాళ్ల బియ్యం, కూరగాయలు అందజేశారు.

దాతృత్వం చాటుకొని... 

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి, బాలానగర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, ఫతేనగర్‌, అల్లాపూర్‌, కేపీహెచ్‌బీకాలనీ, మూసాపేట్‌, బాలాజీనగర్‌ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 9 డివిజన్లలో 70 వేల మంది ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్‌కు వంద క్వింటాళ్ల బియ్యం, క్వింటాల్‌ కందిపప్పు చొప్పున 900 క్వింటాళ్ల బియ్యం, 9 క్వింటాళ్ల కందిపప్పును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సొంత ఖర్చులతో అందజేశారు. 

స్వచ్ఛంద సంస్థల అభయం...

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో మొత్తం 2500 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

చాంద్రాయణగుట్ట పరిధిలో మొత్తం 14 వేల 580 మందికి నిత్యావసర వస్తువులు, 925 క్వింటాళ్ల్ల బియ్యం, 151 క్వింటాళ్ల్ల కందిపప్పు పంపిణీ చేశారు. చార్మినార్‌ నియోజకవర్గం పరిధిలో.. మొత్తం 2 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, 2 వేల 500 క్వింటాళ్ల్ల బియ్యం, 20 క్వింటాళ్ల కందిపప్పు పంపిణీ చేశారు. తెలంగాణ బెంగాల్‌ సమితి సభ్యులు పెద్ద మొత్తంలో సరుకులు అందజేశారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రతిరోజూ 2000 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 1000 మందికి , యాక్షన్‌ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థ 500 మందికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నది. సీఎస్‌కే డెవలపర్స్‌ ఆధ్వర్యంలో 500 మందికి నిత్యావసరుకులు పంపిణీ చేస్తున్నారు.

డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఆధ్వర్యంలో బియ్యం వెయ్యి , పప్పు 2 వందల క్వింటాళ్లు, చక్కెర వంద క్వింటాళ్లు, చింతపండు 50 క్వింటాళ్లు, నూనె 10 వేల  కేజీలు  అందజేస్తున్నారు. 

పేదలు ఇబ్బందులు పడొద్దని.... 

కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు 5500 వేల మందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు.  250 క్వింటాళ్ల బియ్యం,30 క్వింటాళ్ల పప్పు,25 క్వింటాళ్ల గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను ఇంటింటికీ తిరిగి అందిస్తున్నారు. పాత బోయిన్‌పల్లిలోని స్వర్ణధామనగర్‌ కాలనీలో ఇండ్లలో పనిచేసే వారితో పాటు జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు 10 కిలోల చొప్పున ప్రతి శనివారం 200 మందికి బియ్యం పంపిణీ చేస్తున్నారు. 

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 9840 మందికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మొత్తం 84 క్వింటాళ్ల బియ్యం, 50 క్వింటాళ్ల పప్పు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు టి.సోమసుందర్‌ ఆధ్వర్యంలో 25 క్వింటాళ్ల బియ్యం, 20 క్వింటాళ్ల పప్పు పంపిణీ చేశారు.

పెద్ద మనసుతో...

సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్‌ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లో 630 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చొరవతో బేగంబజార్‌కు చెందిన గుప్త్త 630 మందికి 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనెతో పాటు ఇతర సరుకులు సిద్ధం చేయగా, వీటిని అధికారుల ద్వారా ప్రజలకు పంపిణీ చేశారు.  

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలో సుమారు 2,800 మందికి దాదాపు రూ.14 లక్షల విలువ చేసే బియ్యం, కందిపప్పు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 

అంబర్‌పేట నియోజకవర్గంలో 125 క్వింటాళ్ల బియ్యం అందజేశారు.  పప్పు 1.04, పిండి 2.30 క్వింటాళ్లు, 500 కిలోల చక్కెర, 1200 కిలోల కారంపొడి, 1200 కిలోల పప్పు, 760 కిలోల ఉప్పు పంపిణీ చేశారు.  

మేమున్నామంటూ... 

గోషామహల్‌, కార్వాన్‌, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలో వెయ్యి క్వింటాళ్ల బియ్యం, 200క్వింటాళ్ల కందిపప్పు, ఇతర సరుకులు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నందకిశోర్‌వ్యాస్‌ 350 క్వింటాళ్ల బియ్యం, 50 క్వింటాళ్ల పప్పును పేదలకు అందించారు.  కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినొద్దీన్‌, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌ హుస్సేన్‌, వంద క్వింటాళ్ల వరకు వేర్వేరుగా అందించారు. 

మేడ్చల్‌ నియోజకవర్గంలో 3500 మంది నిరుపేదలకు 302 క్వింటాళ్ల బియ్యం, 9.5 క్వింటాళ్ల పప్పుతో పాటు ఇతర వస్తువులను దాతలు పంపిణీ చేస్తున్నారు.  పది, పన్నెండు రోజులుగా నియోజకవర్గంలో మొత్తం 5639 క్వింటాళ్ల బియ్యం,180 క్వింటాళ్ల పప్పును 50,520 మంది నిరుపేదలు, వలస కూలీలకు పంపిణీ చేశారు. 

తోడుగా నిలిచి...

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని సుమారు 25,600 మందికి 125 టన్నుల బియ్యం, 6.6 టన్నుల పప్పు దినుసులను పంపిణీ చేశారు. నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 9వేల మందికి 45 టన్నుల బియ్యం, రెండున్నర టన్నుల పప్పు అందించారు. దుండిగల్‌ మున్సిపల్‌ పరిధిలో 7,850 మందికి 39 టన్నుల బియ్యం, 2 టన్నుల పప్పు, కొంపల్లి మున్సిపల్‌ పరిధిలో 12 టన్నుల బియ్యం, 600 కిలోల పప్పు 2350 మందికి పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో 4 వేల మంది నిరుపేదలకు 18 టన్నుల బియ్యం, 1200 కిలోల పప్పు , గాజులరామారం సర్కిల్‌ పరిధిలో 1500 మందికి 11 టన్నుల బియ్యం, 300 కిలోల పప్పును పంపిణీ చేశారు.గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో 300 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు.

తోచినంత సాయం...

ఉప్పల్‌ నియోజకవర్గంలో  22,730 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 639.5 క్వింటాళ్ల బియ్యం, పప్పు 41 క్వింటాళ్లు అందజేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, హబ్సిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి ఆధ్వర్యంలో 14 రోజులుగా 5 వేల మంది పేదలు, వలస కూలీలకు 200 క్వింటాళ్ల బియ్యం, 1500 కిలోల కందిపప్పు, పలు రకాల కూరగాయలను అందజేశారు. నాచారం డివిజన్‌లో కార్పొరేటర్‌ శాంతిసాయిజెన్‌ శేఖర్‌, ఆర్యవైశ్య సంఘం, దాతల ఆధ్వర్యంలో 150 క్వింటాళ్ల బియ్యం, 10 క్వింటాళ్ల పప్పు, నూనె, పిండి, కూరగాయలు అందజేశారు. నాచారంలో వంద క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు. మల్లాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ సంక్షేమ సంఘాలు, టీఆర్‌ఎస్‌పార్టీ నాయకుల సహకారంతో 2000 మంది పేదలు, వలస కూలీలకు 30 క్వింటాళ్ల బియ్యం, 10 క్వింటాళ్ల కందిపప్పు, కూరగాయలు అందజేశారు.

కష్టకాలంలో అండగా..

ఎల్బీనగర్‌ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 520 క్వింటాళ్ల బియ్యం, 55 క్వింటాళ్ల కందిపప్పు, నిత్యావసర వస్తువులను పేదలకు, వలస కార్మికులకు సుమారు 23,500 వేల మందికి ఇప్పటి వరకు పంపిణీ చేశారు. హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో 120 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల కందిపప్పు నిత్యావసర వస్తువులు అందించారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో 40 క్వింటాళ్ల బియ్యం, 7 క్వింటాళ్ల కందిపప్పు, నిత్యావసర సరుకులు కలిపి రూ. 5 లక్షల వరకు పంపిణీ చేశారు.

ఆదుకోవడమే లక్ష్యంగా...

మలక్‌పేట నియోజకవర్గం పరిధిలో 4,980 మందికి 18 క్వింటాళ్ల 500 కేజీల బియ్యం, 9 క్వింటాళ్ల 200 కేజీల కంది పప్పు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ యాకుత్‌ఫురా నియోజకవర్గం ఇన్‌చార్జి సామ సుందర్‌ రెడ్డి  ఆధ్వర్యంలో 2,400 మందికి 12 క్వింటాళ్ల 500 కేజీల కూరగాయలతోపాటు, 600 కుటుంబాలకు అర లీటర్‌ పాలు, బ్రెడ్‌ ప్యాకెట్లు అందించారు. 

కార్పొరేటర్‌ తీగల సునరితారెడ్డి 1000 మందికి , మాజీ కార్పొరేటర్‌ చేకోలేకార్‌ శ్రీనివాస్‌ 600 మందికి నిత్యావసర సరుకులు అందించారు. 


logo