ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 23:54:32

మద్యం షాపులపై ఆబ్కారీ నిఘా

మద్యం షాపులపై ఆబ్కారీ నిఘా

  • మద్యం విక్రయిస్తే జైలే.. 
  • వైన్స్‌, బార్‌ల తాళం తీస్తే లైసెన్స్‌లు రద్దు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఆబ్కారీ డేగకన్ను పెట్టింది. మద్యం విక్రయాలపై నిషేధం ఉండడటంతో మద్యం రవాణా, విక్రయాలు, సరఫరా జరుగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సి.వివేకానందరెడ్డి, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ మహ్మద్‌ ఖురేషీ తెలిపారు. మద్యం విక్రయాలు జరగకుండా ఇప్పటికే అన్ని దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సీల్‌ వేయడంతోపాటు మార్చి 22వ తేదీ నాటికి మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లలో ఉండాల్సిన మద్యం విలువలకు సంబంధించిన పూర్తి స్టాటిస్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడైనా అనుమానం వస్తే వెంటనే సంబంధిత మద్యం దుకాణంలోని మద్యం నిల్వలు, వాటి స్టాటిస్టిక్స్‌ను పరిశీలించి తేడా వస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా షాపుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. 

హైదరాబాద్‌లో అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడిన 14మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 250లీటర్ల మద్యం, 119 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా డీసీ వివేకానందరెడ్డి తెలిపారు. ధూల్‌పేటలో 44లీటర్ల గుడుంబా, 2150 లీటర్ల వాష్‌, 130కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని 20 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్లులో ఒక మద్యం షాపును సీజ్‌ చేయడంతోపాటు అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడిన 26మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 279లీటర్ల మద్యం, 132లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా డీసీ మహ్మద్‌ ఖురేషీ వెల్లడించారు. గుడుంబా విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 15లీటర్ల ఐడీ లిక్కర్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.  

తాళం తీస్తే జైలుకే..

లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైనా మద్యం వ్యాపారులు వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల తాళాలు తీస్తే వాటి లైసెన్స్‌లు రద్దు చేయడమే కాకుండా నిర్వాహకులకు జైలు శిక్ష తప్పదని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల డిప్యూటీ కమిషనర్లు వివేకానందరెడ్డి, మహ్మద్‌ ఖురేషీ హెచ్చరించారు.

348 మద్యం బాటిళ్ల పట్టివేత

మల్కాజిగిరి ఎక్సైజ్‌ పరిధిలోని వినాయక్‌నగర్‌, సఫిల్‌గూడలో అక్రమంగా నిల్వ ఉంచిన 348 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌సింగ్‌ మంగళవారం తెలిపారు. వినాయక్‌నగర్‌లోని బండ విశ్వనాథ్‌గౌడ్‌ నివాసంలో 144 మద్యం బాటిళ్లు, ఓల్డ్‌ సఫిల్‌గూడలో అమర్‌నాథ్‌ ఇంట్లో 204 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని మహేశ్‌నగర్‌లో సిద్దిరాములు వైన్‌షాప్‌లో పనిచేసే వాసురెడ్డి, అతడి స్నేహితుడు లింగారెడ్డి రూ.41వేల విలువ చేసే మద్యం బాటిళ్లను కారులో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.


logo