శనివారం 30 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 23:53:17

కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు

కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలో ఉన్న 30 సర్కిళ్లను 17 జోన్లుగా విభజించామని, ఒక్కోజోన్‌కు వైద్య, రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ శాఖలకు చెందిన ఒక్కొక్క అధికారి బాధ్యులుగా ఉంటారని చెప్పారు. విద్యుత్‌, మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 12 రైతు బజార్లలో నిత్యం 4వేల క్వింటాళ్ల కూరగాయలను ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ స్ప్రే చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో 126 కంటైన్మెంట్లను ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

అలాగే మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు క్రెడాయ్‌ సంస్థ ప్రతినిధులు 41వేల మంది భవన నిర్మాణ కార్మికులకు లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తలసాని వివరించారు. అన్నపూర్ణ పథకంలో మధ్యాహ్నం 60 వేల మందికి, సాయంత్రం 30 వేల మందికి ఉచిత భోజనం అందిస్తున్నామని, అంతేకాకుండా 18వేల మందికి గుజరాత్‌ సేవామండలి, ఇతర స్వచ్ఛంద సంస్థలు వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ  చేస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలో ఉన్న 5.80 తెల్ల రేషన్‌ కార్డుదారులకు 674 షాపుల్లో బియ్యం పంపిణీ జరుగుతుందని, రూ.1500 నగదును కూడా వారి ఖాతాల్లో జమ చేశామని తలసాని చెప్పారు.


logo