మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 23:51:29

మందుబాబులే లక్ష్యం

మందుబాబులే లక్ష్యం

  • ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనలతో సైబర్‌ నేరగాళ్ల చీటింగ్‌ 
  • డబ్బు రీఫండ్‌ పేరుతో లక్షలు కొల్లగొట్టారు  

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైబర్‌ క్రిమినల్స్‌ మందుబాబులను టార్గెట్‌ చేశారు. దీని కోసం గూగుల్‌ సెర్చ్‌లో ఫేక్‌ లింక్‌లను తయారు చేశారు. దీంతో గూగుల్‌లో సెర్చ్‌ చేసిన చాలామంది వారి వలలో పడుతున్నారు. అయితే ఈ ఫేక్‌ నంబరులో సంప్రదించిన వారికి మీకు కావాల్సిన మద్యాన్ని అరగంటలో డెలివరీ చేస్తామని నమ్మించడంతో మందుబాబులు మనీ డిపాజిట్‌ చేసేస్తున్నారు. ఆశతో డెలివరీ వస్తుందని కండ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తూ నిరుత్సాహానికి గురవుతున్నారు. బయటికి చెబితే పరువు పోతుందని చాలా మంది ఫిర్యాదు కూడా ఇవ్వడం లేదని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి లింక్‌లను ఎవరూ నమ్మొద్దని సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సూచిస్తున్నారు. ఇలా మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన రాష్ట్రంలో హోం డెలివరీ ద్వారా మద్యం సరఫరాకు అనుమతి లేదన్న విషయం గుర్తుంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే 7896883733 నంబర్‌కు కాల్‌ చేస్తే మద్యం హోం డెలివరీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందని రాచకొండ పోలీసులు గుర్తించారు.  మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌  బృందం సదరు నంబర్‌ వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నించగా ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన చిరునా మాతో ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా ఈ నంబర్‌ ఫ్రాడ్‌ అని, మద్యం హోం డెలివరీ వస్తుందంటే ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు.


logo